Share News

సీఐఎస్‌ఎఫ్‌ వెనక్కి..!

ABN , Publish Date - Aug 23 , 2026 | 01:15 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నామని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌-కేంద్ర పారిశ్రామిక భదత్రాదళం) తాజాగా నోటీసు జారీ చేసింది.

సీఐఎస్‌ఎఫ్‌ వెనక్కి..!

స్టీల్‌ప్లాంటు నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఉపసంహరణ

మూడు నెలల గడువు

3 నెలల నోటీసు జారీ

ఇకపై ఉక్కు ఆస్తులకు రక్షణ ఎలా?

విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నామని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌-కేంద్ర పారిశ్రామిక భదత్రాదళం) తాజాగా నోటీసు జారీ చేసింది. దీనికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసిందని, మూడు నెలల గడువుతో ఇస్తున్న నోటీసుగా ఈ లేఖను భావించాలని పేర్కొంది. ఈ ఏడాది నవంబరు 17న స్టీల్‌ ప్లాంటు నుంచి సీఐఎస్‌ఎఫ్‌ దళాలు పూర్తిగా వెనక్కి వెళ్లిపోతాయని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పరోక్షంగా సూచించింది. అదే జరిగితే ప్లాంటుకు భద్రత ఎలా అనే దానిపై చర్చ జరుగుతోంది.

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటిలోను భద్రతా పరమైన వ్యవహారాలను సీఐఎస్‌ఎఫ్‌ చూసుకుంటుంది. పార్లమెంటు భవనం, విమానాశ్రయాలు, కరెన్సీ ముద్రించే మింట్లు అన్నింటికీ రక్షణ కల్పిస్తుంది. స్టీల్‌ ప్లాంటు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థే కావడంతో 1983లోనే ఇక్కడ ఒక యూనిట్‌ ఏర్పాటుచేశారు. ప్లాంటు ఆస్తులు, యంత్ర పరికరాలు, ఉత్పత్తికి సంబంధించిన మెటీరియల్‌కు రక్షణ కల్పిస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించరు. స్టీల్‌ ప్లాంటులో రక్షణ విభాగానికి సంబంధించి 1,003 మంది, అగ్నిమాపక విభాగానికి సంబంధించి 298 మంది ఉండేవారు. ఇటీవల కాలంలో ఖర్చులు తగ్గించుకోవాలని భావించిన యాజమాన్యం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూడా అంతమంది అవసరం లేదని, కొంత తగ్గించాలని చెన్నై కార్యాలయాన్ని కోరింది. ఆ మేరకు 438 మందిని 2025 ఫిబ్రవరిలో హైదరాబాద్‌, చెన్నై తదితర ప్రాంతాలకు బదిలీ చేశారు. మిగిలిన 883లో మరో వంద మందిని ఆరు నెలల క్రితం తగ్గించారు. ఇప్పుడు సుమారు 750 మంది వరకు ఉన్నారు. ఇప్పుడు వారంతా నవంబరు నుంచి వెనక్కి వెళ్లిపోతారు.

ఏపీఎస్‌పీ సహకారం

స్టీల్‌ ప్లాంటుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినప్పుడు సీఐఎస్‌ఎఫ్‌ అంశం కూడా చర్చకు వచ్చింది. ఆ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ వద్దనున్న ఏపీ స్పెషల్‌ పోలీసులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టుల ఏరివేతలో ఏపీఎస్‌పీ కీలకంగా ఉండేది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్‌ చేసేది. ఇప్పుడు ఆ సమస్య లేకపోవడంతో ఆ విభాగంలో చాలా మంది ఖాళీగానే ఉన్నారు. వారిలో కొందరిని స్టీల్‌ ప్లాంటుకు కేటాయించే అవకాశం ఉంది.

అగ్నిమాపక విభాగం ప్రత్యేకం

సుమారుగా 25 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాంటులో మూడు ఫైర్‌ స్టేషన్లు, వాటిలో 13 ఫైర్‌ ఇంజన్లు (అగ్నిమాపక వాహనాలు), వాటిలో పనిచేయడానికి 282 మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. ఇవి కాకుండా ప్లాంటులో 2,744 ఫైర్‌ హైడ్రెంట్లు, 1,071 ఎక్సటర్నల్‌ ఫైర్‌ హైడ్రెంట్లు, 86 మానిటరింగ్‌ కేంద్రాలు, 28 ఫైర్‌ ఫైటింగ్‌ పంప్‌హౌస్‌లు ఉన్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు కొన్ని మంటలను నీటితో కాకుండా ఫోమ్‌, రసాయనాలను ఉపయోగించి నియంత్రించాల్సి ఉంటుంది. దానికి తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో 14 వేల ఫైర్‌ ఎక్సిటింగ్‌ విషర్లు ఏర్పాటుచేశారు. ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందితో గత నాలుగు దశాబ్దాలుగా ఈ విభాగాన్ని నడుపుతున్నారు. స్టీల్‌ ప్లాంటులోనే కాకుండా హెచ్‌పీసీఎల్‌, ఫార్మా పరిశ్రమల్లో భారీ ప్రమాదాలు జరిగినప్పుడు స్టీల్‌ ప్లాంటు ఫైర్‌ ఇంజన్లు వెళ్లి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ విభాగాన్ని అవుట్‌సోర్సింగ్‌ విధానంలో నిర్వహించడానికి గతంలోనే టెండర్లు పిలిచింది. ఎవరూ ముందుకురాలేదు. దీని నిర్వహణ ఎలా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సీఐఎస్‌ఎఫ్‌ ఉపసంహరణ అంటే...ప్లాంటును మళ్లీ ప్రైవేటుకు అప్పగించే ఆలోచన చేస్తున్నారని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Updated Date - Aug 23 , 2026 | 01:15 AM