పెద్దాస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:33 AM
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో వైద్య సేవలతోపాటు కొన్నిరకాల పరీక్షలు చేయించుకునేందుకు, పత్రాలు పొందేందుకు ఒకటికి పదిసార్లు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు సదరం సర్టిఫికెట్ పొందేందుకు రోజుల తరబడి ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అలాగే, ఖరీదైన పరీక్షలు (కేజీహెచ్‌లో ఉచితమే) చేయించుకోవడానికి వారాల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందంటున్నారు.
వైద్య పరీక్షల కోసం పడిగాపులు
ఎంఆర్‌ఐ, సీటీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ,
ఆల్ర్టాసౌండ్ స్కానింగ్‌కు రోజుల తరబడి నిరీక్షణ
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం
సదరం పరీక్షలు పూర్తయినా సర్టిఫికెట్లు జారీలో అలసత్వం
విశాఖపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో వైద్య సేవలతోపాటు కొన్నిరకాల పరీక్షలు చేయించుకునేందుకు, పత్రాలు పొందేందుకు ఒకటికి పదిసార్లు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు సదరం సర్టిఫికెట్ పొందేందుకు రోజుల తరబడి ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అలాగే, ఖరీదైన పరీక్షలు (కేజీహెచ్‌లో ఉచితమే) చేయించుకోవడానికి వారాల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందంటున్నారు.
కేజీహెచ్‌కు ప్రతిరోజూ సుమారు నాలుగు వేల మంది రోగులు వస్తుంటారు. వారిలో సుమారు వేయి మందికి, అలాగే ఇన్‌పేషెంట్లుగా వివిధ విభాగాల్లో సేవలు పొందే మరో వేయి మందికి వివిధ రకాల పరీక్షలు చేయించాల్సి వస్తుంది. ఇందులో రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐ, సీటీతోపాటు ఆల్ర్టా సౌండ్ స్కానింగ్ వంటివి ఉంటాయి. రక్త పరీక్షలు అదేరోజు చేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఫలితాల కోసం మరోరోజు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. అలాగే, ఎక్స్‌రే కూడా కొన్నిసార్లు మరుసటిరోజు చేయించుకోవాల్సి వస్తోంది. కొన్నిరకాల వ్యాధుల నిర్ధారణకు ఎంఆర్‌ఐ చేయించాల్సి వస్తుంది. ఈ పరీక్ష కోసం అయితే రోగులు వారాల తరబడి నిరీక్షించాలి. ఒక్కోసారి నెల రోజుల తరువాత రావాలని సూచిస్తున్నారని అనకాపల్లి నుంచి వచ్చిన రాజేంద్ర వాపోయాడు. అలాగే, సీటీ స్కాన్‌కు మరుసటి రోజుగానీ, రెండు రోజుల తరువాత గానీ రావాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. ఇక ఆల్ర్టా సౌండ్ స్కానింగ్ చేయించుకోవడానికి రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో గర్భిణులు, ఇతర రోగులు ఆల్ర్టాసౌండ్ స్కానింగ్ కోసం బారులు తీరి కనిపిస్తుంటారు. అలాగే, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలకు ఇదే పరిస్థితి. ఈ పరీక్షలు చేయించుకోవాలంటే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. రోగుల సంఖ్య భారీగా పెరగడంతో ఈ పరీక్షలు చేయించే విభాగంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. ఏమీ చేయలేని స్థితిలో విభాగం వైద్యులు ఉంటున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలంటే మరిన్ని మెషీన్లు అందుబాటులోకి తీసుకురావాలని, రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాలని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు.
పత్రాల కోసం పాట్లు
జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు కోసం ఆస్పత్రికి వచ్చేవారి పాట్లు వర్ణణాతీతమనే చెప్పాలి. రెండు, మూడుసార్లు వస్తే తప్ప పని కావడం లేదని పలువురు వాపోతున్నారు. అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సిబ్బంది ఇష్టపడకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు పేర్కొంటున్నారు. సైటు ఓపెన్ కావడం లేదని, సమస్యలు ఉన్నాయంటూ తిప్పుతుంటారని, ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఈ విభాగంలో సిబ్బందే కనిపించరని పలువురు వాపోతున్నారు. ఇక, సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చేవారి ఇబ్బందులు తక్కువేమీ కాదు. సదరం శిబిరాలకు హాజరైన రోగులకు సర్టిఫికెట్లను జారీ చేసే ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలి. అయితే, అధికారులు ఆయా వివరాలను ఆన్‌లైన్ చేయడంలో తాత్సారం చేస్తుండడంతో సర్టిఫికెట్ల కోసం అనేకమార్లు ఈ విభాగం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.