సర్వేనంబరు 133పై సీఐడీ
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:52 AM
మధురవాడలో సర్వేనంబరు 133లో 3.47 ఎకరాల భూమి వ్యవహారంపై సీఐడీ తాజాగా విచారణ చేపట్టింది.
మధురవాడలో హౌసింగ్‌బోర్డు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తికి కేటాయించిన వ్యవహారంపై చర్యలు
విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):
మధురవాడలో సర్వేనంబరు 133లో 3.47 ఎకరాల భూమి వ్యవహారంపై సీఐడీ తాజాగా విచారణ చేపట్టింది. హౌసింగ్‌బోర్డుకు చెందిన ఈ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తికి అప్పగించే ఘటనపై ఇప్పటికే భీమిలి ఆర్డీవోగా పనిచేసిన భాస్కరరెడ్డి, మరికొందరిపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇంకా భూమికి సంబంధించి తప్పుడు రికార్డులు సృష్టించిన ఘటనటపై విచారణకు సీఐడీకి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తాజాగా సీఐడీ అధికారులు సర్వేనంబరు 133కు వెళ్లి పరిశీలించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ, హౌసింగ్‌బోర్డు అధికారుల నుంచి పలు వివరాలు సేకరించారు. మఽధురవాడలో సర్వేనంబరు 133లో 9.36 ఎకరాలను హౌసింగ్‌బోర్డుకు ప్రభుత్వం చాలాకాలం క్రితమే కేటాయించింది. ఈ స్థలానికి సమీపంలోనే ఐటీ కంపెనీలు ఉండడంతో భూములకు గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా సుమారు రూ. 30 కోట్ల వరకు పలుకుతుంది. హౌసింగ్‌బోర్డు ఆధీనంలోనే 9.36 ఎకరాలు ఉన్నప్పటికీ ఖాళీగా ఉంది. అయితే స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి గతంలో బోర్డుపెట్టారు. గత ప్రభుత్వంలో కొందరు అక్రమార్కులు ఖాళీగా ఉన్న సర్వేనంబరు 133లో భూములపై కన్నేశారు. ఈ స్థలాన్ని కొట్టేయాలని స్కెచ్ వేసిన వారికి కొందరు అధికారులు సహాయంచేశారనే ఆరోపణలున్నాయి. హౌసింగ్‌బోర్డుకు చెందిన 9.36 ఎకరాల్లో 3.47 ఎకరాలు తమ కుటుంబానికి చెందినదని తప్పుడు పత్రాలు రూపొందించి విశాఖరూరల్ తహశీల్దారుకు అందజేశారు. వెంటనే ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా రెవెన్యూ అధికారులు నివేదిక రూపొందించారు. ఈ స్థలాన్ని హౌసింగ్‌బోర్డుకు కేటాయించిన విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ తరువాత నివేదికను అప్పటి జేసీ విశ్వనాఽథ్‌కు సమర్పించారు.
అదే సమయంలో తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని జేసీకి హౌసింగ్‌బోర్డు అధికారులు నివేదించారు. ఆర్డీవో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న సర్వేనంబరు, హౌసింగ్‌బోర్డు అధికారులు చెప్పిన సర్వేనంబరు ఒకటే కావడంతో అనుమానం వచ్చి సర్వేనంబరు 133లో స్థలాన్ని పరిశీలించి హౌసింగ్‌బోర్డు స్థలంగా రికార్డుల్లో ఉందని గుర్తించిన ఆయన అదే స్థలం వద్ద అధికారులను తీవ్రంగా మందలించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక రాశారు. ప్రైవేటు వ్యక్తిపై కేసునమోదుచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సర్వేనంబరు 133లో 3.47 ఎకరాల హౌసింగ్‌బోర్డు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టాలని ప్రయత్నించిన అప్పటి ఆర్డీవో భాస్కరరెడ్డి, ఆర్‌ఐ టి.మల్లేశ్వరరావు, వీఆర్వోపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ కుట్రపై విచారణకు సీఐడీని ఆదేశించింది. దీంతో ఇటీవల సీఐడీ అఽధికారులు విచారణ చేసి హౌసింగ్‌బోర్డు, రెవెన్యూ అధికారుల నుంచి రికార్డులు తీసుకున్నారు. విచారణ మరింతలోతుగా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.