మలేరియా పోస్టులపై చోటాల కన్ను
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:52 AM
జీవీఎంసీ మలేరియా విభాగంలో తాత్కాలిక ఉద్యోగాలపై ఎమ్మెల్యేల అనుచరుల కన్నుపడింది. మనవెంట తిరుగుతున్న వారికి అవకాశం కల్పిస్తే సంతోషపడతారని ఎమ్మెల్యేలకు చెప్పి...అధికారులకు ఫోన్‌లు చేయిస్తున్నారు.
వర్షాకాలం నేపథ్యంలో దోమల నియంత్రణకు తాత్కాలికంగా 431 మంది నియామకానికి జీవీఎంసీ ప్రతిపాదనలు
అవి జీవీఎంసీలో ఉద్యోగాలంటూ కొందరు ఎమ్మెల్యేల అనుచరులు ప్రచారం
ఆశావహుల నుంచి వసూళ్లకు రంగం సిద్ధం
గతంలో పనిచేసిన వారిని కాకుండా తాము చెప్పిన వారినే తీసుకోవాలంటూ ఎమ్మెల్యేల ద్వారా అధికారులకు ఫోన్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ మలేరియా విభాగంలో తాత్కాలిక ఉద్యోగాలపై ఎమ్మెల్యేల అనుచరుల కన్నుపడింది. మనవెంట తిరుగుతున్న వారికి అవకాశం కల్పిస్తే సంతోషపడతారని ఎమ్మెల్యేలకు చెప్పి...అధికారులకు ఫోన్‌లు చేయిస్తున్నారు. గతంలో పనిచేసిన వారిని కాకుండా తాము సూచించిన వారినే విధుల్లోకి తీసుకోవాలంటూ చెప్పిస్తున్నారు. ఆ తరువాత తెర వెనుక వసూళ్లకు తెరదీస్తున్నారు.
వర్షాకాలంలో దోమల నివారణ చర్యలు చేపట్టేందుకుగాను 431 మంది కార్మికులను తాత్కాలికంగా (మూడు నెలలు పాటు) పనిలోకి తీసుకునేందుకు జీవీఎంసీ మలేరియా విభాగం అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. గతంలో ఇదే పని చేపట్టిన కార్మికులను తీసుకుంటే వారికి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి మెరుగైన ఫలితాలు వస్తాయని భావించారు. అయితే నగరానికి చెందిన కొందరు ఎమ్మెల్యేల అనుచరులు దానిని సొమ్ము చేసుకునేందుకు ఉబలాటపడుతున్నారు.
వర్షాలు జూన్‌లో ప్రారంభమై సెప్టెంబరు/అక్టోబరు వరకు కురుస్తుంటాయి. ఈ కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే జూన్ నుంచి అక్టోబరు వరకు ‘అపిడమిక్ సీజన్‌గా’ ప్రజారోగ్య విభాగం అధికారులు పరిగణిస్తారు. అపిడమిక్ సీజన్‌లో దోమల వృద్ధిని నియంత్రించడంతోపాటు అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జీవీఎంసీ ఏటా మూడు నెలల పాటు రోజువారీ కూలీ ప్రాతిపదికన 431 మందిని నియమించుకుంటుంది. వీరందరికీ గతంలో కాంట్రాక్టర్ ద్వారా వేతనాలు చెల్లించేవారు. గత రెండేళ్లుగా స్వయం సహాయక సంఘాల ద్వారా చెల్లిస్తున్నారు. మూడు నెలల తర్వాత కూడా దోమల బెడద ఉంటే మరో మూడు నెలలు వారి సేవలను పొడిగిస్తారు. ఏటా ఇదే మాదిరిగా జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా అపిడమిక్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుకునేందుకు ప్రజారోగ్య విభాగం అధికారులు 431 మంది కార్మికులను మూడు నెలలపాటు నియమించుకునేందుకు ప్రతిపాదనలు తయారుచేసి కమిషనర్‌కు పంపించారు. కమిషనర్ నుంచి ఆమోదం రాగానే గత సీజన్‌లో పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్నవారిని తీసుకుని, మిగిలిన ఖాళీల్లో కొత్తవారిని తీసుకోవాలని అధికారులు భావించారు. గతంలో పనిచేసిన వారికి దోమల లార్వా గుర్తింపు, వాటిని ధ్వంసం చేయడంపై అవగాహన ఉంటుంది కాబట్టి, మెరుగైన ఫలితాలను ఉంటాయన్నది అధికారుల ఆలోచన.
జీవీఎంసీలో ఉద్యోగాలంటూ కొందరు ఎమ్మెల్యేల అనుచరుల వసూళ్లపర్వం
మలేరియా విభాగంలో మూడు నెలల కాల పరిమితితో తీసుకునే ఆ ఉద్యోగాలను జీవీఎంసీలో పోస్టులంటూ కొందరు ఎమ్మెల్యేల అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఆశావహులు ఎవరైనా వస్తే వారి నుంచి ఎంతో కొంత తీసుకుని ఆ ఉద్యోగాలను కట్టబెట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలకు జీవీఎంసీలో మలేరియా పోస్టులు తీస్తున్నారని, మూడు నెలలు పాటే అయినప్పటికీ మనవెంట తిరుగుతున్న వారికి అవకాశం కల్పిస్తే వారంతా సంతోషపడతారని చెబుతున్నారు. జీవీఎంసీ అధికారులకు ఎమ్మెల్యేలతో ఫోన్ చేయించి గతంలో పనిచేసినవారిని కాకుండా తాము సూచించే వారిని ఉద్యోగంలో తీసుకోవాలని చెప్పిస్తున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు కొత్తవారిని తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తే...తాము డబ్బులు వసూలు చేసిన వారిపేర్లతో కూడిన జాబితాను పంపించేయాలని చూస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకపోతే గతంలో పనిచేసినవారు రోడ్డెక్కడం ఖాయమని పేర్కొంటున్నారు.