ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
ABN , Publish Date - May 23 , 2026 | 12:16 AM
మన్యంలో ఎండల తీవ్రతకు గిరిజనులు విలవిలలాడుతున్నారు. ఎండకుతోడు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
తగ్గని ఎండలు
పల్లెల్లో చెట్ల నీడన గడుపుతున్న గిరిజనులు
పట్టణాల్లో ఇళ్లు వదలని జనం
నిర్మానుష్యంగా ముఖ్యమైన కూడళ్లు
సీలేరులో 40, కొయ్యూరులో 39 డిగ్రీలు
పాడేరు, మే 22 (ఆంధ్రజ్యోతి):
మన్యంలో ఎండల తీవ్రతకు గిరిజనులు విలవిలలాడుతున్నారు. ఎండకుతోడు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై, మధ్యాహ్నానికి మరింత తీవ్రమైంది. దీంతో మధ్యాహ్నం వేళల్లో జనం బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. గత కొన్నిరోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా ఉక్కపోత కొనసాగుతున్నది. ఉక్కపోతకు పట్టణాల్లో జనం చెట్ల నీడలో కూడా ఉండ లేక ఇళ్లలో ఏసీలు వేసుకొని ఉంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు చెట్ల నీడలోనే గడుపుతున్నారు.
ఏజెన్సీలో శుక్రవారం సీలేరులో 40 డిగ్రీల సెల్సీయస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. కొయ్యూరులో 39.0 డిగ్రీలు, పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడలో 37.2, అనంతగిరిలో 36.6, చింతపల్లిలో 35.6, అరకులోయలో 35.4, జి.మాడుగులలో 32.9, ముంచంగిపుట్టులో 30.9, హుకుంపేటలో 30.2, పెదబయలులో 29.0 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సీలేరులో
జీకేవీధి మండలం సీలేరులో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోయారు. వేసవి కాలం ప్రారంభమైన తరువాత శుక్రవారమే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సీలేరు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎండకుతోడు ఉక్కపోతతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు.
కొయ్యూరులో..
మండలంలో శుక్రవారం భానుడు తీవ్ర ప్రతాపం చూపించడంతో మండల కేంద్రంతోపాటు పలు ప్రఽధాన కూడళ్లు ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్మానుష్యంగా మారాయి. శుక్రవారం మండలంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతతోపాటు ఉక్కపోత కారణంగా ప్రజలు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. దీంతో మండల కేంద్రం బోసిపోయింది. అటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్లే ప్రధాన కూడలి అయిన కాకరపాడు సెంటరు కనీస జన సంచారం లేకుండా దర్శనమిచ్చింది. అలాగే చింతలపూడి, రావణాపల్లి, నడింపాలెం తదితర కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎండ తీవ్రత కారణంగా కొయ్యూరు, మంప, రేవళ్లు, ఏలేశ్వరం, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాలకు వెళ్లే ఆర్‌టీసీ బస్సులు ప్రయాణికులు లేకుండా తిరిగాయి. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రోహిణి కార్తెలో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముంచంగిపుట్టులో..
రెండు రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎండ వేడికి ప్రజలు విలవిలలాడుతున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో 30.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడికి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే వారు ఎండవేడికి త్వరగతిన ఇంటిముఖం పడుతున్నారు. పాదచారులు ఎండ బారిన పడకుండా గొడులు, టోపీలు, నెత్తిన రుమాల్స్, టవల్స్ వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు.