ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
ABN , Publish Date - May 21 , 2026 | 12:55 AM
తీవ్రమైన ఉక్కపోతతో నగర ప్రజలు బుధవారం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేఘాలు ఆవరించినా వర్షం కురవలేదు. గాలిలో తేమశాతం 80 వరకు నమోదుకావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ములగాడలో 41.1 డిగ్రీలు నమోదు
నేడు నాలుగు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
ఉదయం పది గంటల తరువాత బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి):
తీవ్రమైన ఉక్కపోతతో నగర ప్రజలు బుధవారం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేఘాలు ఆవరించినా వర్షం కురవలేదు. గాలిలో తేమశాతం 80 వరకు నమోదుకావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల్లో ఫ్యాన్లు తిరుగుతున్నా చెమటతో తడిసి ముద్దయ్యారు. బుధవారం ములగాడలో 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ రూరల్‌లో 39.9, పద్మనాభంలో 39.7, ఆనందపురంలో 39 డిగ్రీలు నమోదయ్యాయి. గురువారం పద్మనాభం, భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. గ్రామీణ ప్రాంతంలో ఉదయం పది గంటల తరువాత అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. తీర ప్రాంతంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని, దీంతో అసౌకర్యంతో కూడిన వాతావరణం నెలకొంటుందని తెలిపింది.