Share News

చోడవరం పంచాయతీ నిధులు స్వాహా

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:36 AM

పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగులు ఎవరికి వారు అందినకాడికి చోడవరం పంచాయతీ నిధులను స్వాహా చేశారు. తరువాత బదిలీపై వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. మింగేసిన సొమ్ము సుమారు రూ.50 లక్షలు వుంటుందని తేలింది. ఇందులో కొంతమొత్తం వైసీపీ అధికారంలో వున్నప్పుడు స్వాహా చేయగా, మరికొంత సొమ్ము ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మింగేశారు. కానీ స్వాహారాయుళ్లపై ఉన్నతాధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.

చోడవరం పంచాయతీ నిధులు స్వాహా
చోడవరం పంచాయతీ కార్యాలయం

రూ.50 లక్షల మేర మింగేసిన గత ఈవో, సిబ్బంది

వైసీపీ హయాంలో అక్రమాలు

కూటమి వచ్చిన తరువాత బయటపడిన వైనం

ఉన్నతాఽధికారులకు ఫిర్యాదు చేసినా.. చర్యలు శూన్యం

నిధులు రికవరీ చేయకుండానే వేరే పంచాయతీలకు బదిలీ

స్వాహారాయుళ్లకు మండలస్థాయి అధికారుల దన్ను

చోడవరం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగులు ఎవరికి వారు అందినకాడికి చోడవరం పంచాయతీ నిధులను స్వాహా చేశారు. తరువాత బదిలీపై వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. మింగేసిన సొమ్ము సుమారు రూ.50 లక్షలు వుంటుందని తేలింది. ఇందులో కొంతమొత్తం వైసీపీ అధికారంలో వున్నప్పుడు స్వాహా చేయగా, మరికొంత సొమ్ము ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మింగేశారు. కానీ స్వాహారాయుళ్లపై ఉన్నతాధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.

ఏడాదిన్నర క్రితం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చోడవరం పంచాయతీ ఆదాయ, వ్యయాలపై ఆరా తీయగా, బిల్లు కలెక్టర్‌తోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు కలిసి రూ.14.5 లక్షల ఆస్తి పన్ను డబ్బులను పంచాయతీ ఖాతాకు జమ చేయకుండా స్వాహా చేసినట్టు బయటపడింది. గత ఏడాది వీరు ముగ్గురు వేర్వేరు ప్రదేశాలకు బదిలీ అయ్యారు. తరువాత ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు పంచాయతీ రికార్డులపు తనిఖీ చేసి, నిధులు స్వాహా చేసిన ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. మూడు నెలల క్రితం డీఎల్‌పీవో విచారణ జరిపినప్పటికీ నిధులు స్వాహా చేసిన సిబ్బంది నుంచి రికవరీ చేయలేదు. సదరు ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

పంచాయతీ ఈవోదీ అదేదారి

గత ప్రభుత్వ హయాంలో చోడవరం పంచాయతీ ఈవోగా పనిచేసిన నారాయణరావు కూడా సుమారు రూ.30 లక్షలు స్వాహా చేసినట్టు రెండు నెలల క్రితం బయటపడింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు ఏడాదిపాటు ఆయన ఇక్కడే పనిచేశారు. పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి నిధులు లేకపోవడంతో, రెండు నెలల క్రితం ఆదాయ, వ్యయాల లెక్కలు చూడగా వివిధ పద్దుల కింద డ్రా చేసిన డబ్బులను పంచాయతీ ఈవో సొంతానికి వాడుకున్నట్టు తేలింది. ఇందులో 2024లో బిల్లు కలెక్టర్‌ ఇచ్చిన రూ.2 లక్షలు, మరో బిల్లు కలెక్టర్‌ ఇచ్చిన రూ.2.18 లక్షలు, మంచినీటి సరఫరా కాంట్రాక్టర్‌ పేరిట డ్రాచేసిన రూ.4.54 లక్షలు, సంతలకు వేలంపాట కోసం డిపాజిట్‌ రూపంలో వసూలు చేసిన రూ.2 లక్షలతో పాటు మరికొన్ని నిధులు పంచాయతీ ఖాతాకు జమ కాలేదని గుర్తించారు. ఈ వ్యవహారాన్ని ప్రస్తుత ఈవోతో పాటు సిబ్బంది కలిసి ఎమ్మెల్యే దృష్టికి తెచ్చి, ఫిర్యాదు చేశారు. దీంతో స్వాహా చేసిన నిధుల్లో సుమారు రూ.8 లక్షల మేర గత ఈవో పంచాయతీకి చెల్లించినట్టు సమాచారం. కాగా పంచాయతీలో సాధారణ నిధులు, ఇతర పఽథకాల కింద మంజూరైన నిధులతోపాటు, వసూలు చేసిన ఇంటి పన్నులపై సమగ్ర విచారణ జరిపిస్తే.. మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. నిధులు స్వాహా చేసిన ఉద్యోగులపై జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోకుండా విచారణల పేరుతో కాలయాపన చేస్తుండడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్తి పన్ను నిధులు రూ.14.5 లక్షలను ముగ్గురు ఉద్యోగులు స్వాహా చేసినట్టు నిర్ధారణ అయిన తరువాత, వారి నుంచి నిధులు రికవరీచేయకుండా పంచాయతీ గత ఈవో వీరిని బదిలీ చేయడం పలుఅనుమానాలకు తావిస్తున్నది. ఇక ఈవో సైతం సుమారు రూ.30 లక్షలు మింగేసినట్టు తేలినప్పటికీ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇక్కడి నుంచి బదిలీ చేయడం గమనార్హం.

Updated Date - Jan 21 , 2026 | 12:36 AM