మళ్లీ చింతపల్లి?
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:24 AM
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు త్వరలో పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం ఉండడంతో జిల్లా పరిధిలో ఉన్న అరకులోయ పార్లమెంట్ స్థానం ఎలా మారబోతుంది?, అసెంబ్లీ స్థానాలు ఎక్కడెక్కడ కొత్తగా ఏర్పడతాయనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
పునర్విభజనతో మరోమారు అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశం
మారనున్న జిల్లా స్వరూపం
పోలవరం జిల్లాలో చింతూరు కేంద్రంగా మరో అసెంబ్లీ స్థానం పెరిగే అవకాశం
రెండు జిల్లాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు పరిమితం కానున్న అరకులోయ పార్లమెంట్ స్థానం?
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు త్వరలో పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం ఉండడంతో జిల్లా పరిధిలో ఉన్న అరకులోయ పార్లమెంట్ స్థానం ఎలా మారబోతుంది?, అసెంబ్లీ స్థానాలు ఎక్కడెక్కడ కొత్తగా ఏర్పడతాయనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
జిల్లాలో మూడు కానున్న అసెంబ్లీ స్థానాలు
జిల్లాలో ప్రస్తుతం పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలతో పాడేరు అసెంబ్లీ స్థానం ఉంది. అలాగే అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలతో అరకులోయ అసెంబ్లీ స్థానం ఉంది. అయితే ఈ పదకొండు మండలాలను విభజించి చింతపల్లి కేంద్రంగా కొత్తగా మూడో అసెంబ్లీ స్థానం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అలా జరిగితే పాడేరు అసెంబ్లీ స్థానంలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు మండలాలు. అరకులోయ అసెంబ్లీ స్థానంలో అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి, ముంచంగిపుట్టు మండలాలు. చింతపల్లి అసెంబ్లీ స్థానంలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలు ఉంటాయని అంటున్నారు.
పోలవరం జిల్లాకు మరో అసెంబ్లీ స్థానం
పోలవరం జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ స్థానంలో మొత్తం పన్నెండు మండలాలున్నాయి. దీంతో ఆ అసెంబ్లీ స్థానం పెద్దదిగా ఉంది. ఈ తరుణంలో రంపచోడవరం అసెంబ్లీ స్థానాన్ని రెండుగా విభిజించాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. ఈ క్రమంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి రావడంతో తమ కల నెరవేరబోతోందని రంప ప్రాంతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో రంపచోడవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, గంగవరం, దేవిపట్నం, రాజవొమ్మంగి మండలాలుంటాయి. అలాగే చింతూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చింతూరు, కూనవరం, వీఆర్.పురం, ఎటపాక, వై.రామవరం, గుర్తేడు మండలాలుంటాయనేది అంచనా.
అరకులోయ పార్లమెంట్ పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురంమన్యం, విజయనగరం జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం, పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు.. మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలతో ప్రస్తుతం అరకులోయ పార్లమెంట్ స్థానం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనతో దాని స్వరూపం పూర్తిగా మారిపోతుందని అనుకుంటున్నారు. దీంతో అల్లూరి జిల్లాలోని పాడేరు, అరకులోయ, చింతపల్లి అసెంబ్లీ స్థానాలు, పోలవరం జిల్లాలోని రంపచోడవరం, చింతూరు అసెంబ్లీ స్థానాలు కలిసి అరకులోయ పార్లమెంట్ స్థానంగా ఉంటుందని, ప్రస్తుతం ఇందులో ఉన్న పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు అసెంబ్లీ స్థానాలు పార్వతీపురం కేంద్రంగా ఏర్పడే కొత్త పార్లమెంట్ స్థానంలోకి వెళ్లే అవకాశఽముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మారనున్న రాజకీయ సమీకరణలు
నియోజకవర్గాల పునర్విభజనతో మొత్తం రాజకీయ సమీకరణలు మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. దీంతో అధిక సంఖ్యలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పెరుగుదల అన్ని రాజకీయ పార్టీలకు చక్కని అవకాశంగానే ఉంటుందని భావిస్తున్నారు. ఫలితంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో తమ నేతలను సర్దుబాటు చేసేందుకు ఇబ్బందులు తొలగుతాయని అంటున్నారు. నియోజకవరాల్గ పునర్విభజనపై ప్రస్తుతం అంచనాలు, ఊహాగానాలు మాత్రమే ప్రచారంలో ఉండగా, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం తెలిపే నాటికి ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని స్పష్టమవుతున్నది. ఏదిఏమైనా నియోజకవర్గాల పునర్విభజన అంశం తమకు ఒక చక్కని అవకాశంగానే రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.
చారిత్రక చింతపల్లికి పూర్వవైభవం
నియోజకవర్గాల పునర్విభజనతో చింతపల్లికి పూర్వవైభవం వస్తుందనే వాదన బలంగా వినిపిస్తున్నది. వాస్తవానికి 1967 నుంచి 2004 వరకు చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. దానిలో ఏజెన్సీ మండలాలైన చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరుతోపాటు మైదాన ప్రాంతానికి చెందిన నాతవరం, గొలుగొండ మండలాలుండేవి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో చింతపల్లి అసెంబ్లీ స్థానం పూర్తిగా కనుమరుగైంది. దీంతో అందులోని కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాలు పాడేరు అసెంబ్లీ స్థానంలోకి, నాతవరం, గొలుగొండ మండలాలు నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి చేరాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల పెంపులో భాగంగా మళ్లీ చింతపల్లి కేంద్రంగా అసెంబ్లీ స్థానం పురుడు పోసుకుని పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని స్థానికులు భావిస్తున్నారు.