Share News

చింతపల్లి జడ్పీ హైస్కూల్‌కు మహర్దశ

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:39 AM

మండల కేంద్రం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు మహర్దశ పట్టింది. నియోజకవర్గ ఆదర్శ పాఠశాలగా ఈ పాఠశాలను కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రానున్న రోజుల్లో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన విద్య అందనున్నది.

చింతపల్లి జడ్పీ హైస్కూల్‌కు మహర్దశ
పాఠశాల తాజా పరిస్థితిపై నివేదిక రూపొందిస్తున్న హెచ్‌ఎం గిడ్డి ఈశ్వరి, ఉపాధ్యాయులు

- నియోజకవర్గ ఆదర్శ పాఠశాలగా ఎంపిక

- విద్యార్థులకు అందుబాటులోకి రానున్న మెరుగైన సదుపాయాలు

- ఆధునిక పద్ధతులతో నాణ్యమైన విద్య

చింతపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు మహర్దశ పట్టింది. నియోజకవర్గ ఆదర్శ పాఠశాలగా ఈ పాఠశాలను కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రానున్న రోజుల్లో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన విద్య అందనున్నది.

రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు నియోజకవర్గానికి ఒక ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆ పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక బోధన అందించాలని లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో వెయ్యి మందికి పైబడి విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గం స్థాయి ఆదర్శ పాఠశాలగా ఎంపిక చేసేందుకు ప్రధానంగా విద్యార్థుల సంఖ్య 500 మించి ఉండాలి. ఐదు ఎకరాల విస్తీర్ణం కలిగి ఉండాలి. పాఠశాలకు సమీపంలో ప్రధాన రహదారి, రవాణా సదుపాయం ఉండాలి. క్రీడా మైదానం, పార్కింగ్‌ స్థలం, పచ్చని వాతావరణం ఉండాలి. శబ్ద కాలుష్యానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో పాఠశాల ఉండాలి. పాఠశాల పరిధిలో విద్యుత్‌, కమ్యూనికేషన్‌ సదుపాయాలు కల్పించేందుకు అనువుగా ఉండాలి. పాఠశాలకు ఐదు కిలోమీటర్లలోపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీసు స్టేషన్‌, ఉపాధ్యాయుల నివాసానికి అనువైన గృహసముదాయాలు ఉండాలి. ఈ అర్హతలన్నీ పాడేరు నియోజకవర్గంలో కేవలం చింతపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు మాత్రమే ఉన్నాయి. ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన స్థలం ఉంది. అలాగే ప్రస్తుతం పాఠశాలలో ఆరు నుంచి పదవ తరగతి వరకు 550 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మరో 60 మంది ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 26వ తేదీన జడ్పీ హైస్కూల్‌లో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి ఏర్పడిన డిమాండ్‌ను వివరిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో ‘జడ్పీ హైస్కూల్‌లో సీట్లు ఫుల్‌’ శీర్షిక కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు పాడేరు నియోకవర్గానికి ఆదర్శ పాఠశాలగా చింతపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ఈ మేరకు స్థానిక పాఠశాల తాజా పరిస్థితిపై ప్రధానోపాధ్యాయిని గిడ్డి వరలక్ష్మి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు నివేదికను రూపొందిస్తున్నారు. ఈ నివేదికను విద్యాశాఖ, కలెక్టర్‌ ద్వారా విద్యాశాఖ కమిషనర్‌కు పంపించనున్నారు.

అందుబాటులోకి రానున్న సదుపాయాలు

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆదర్శ పాఠశాలగా ఎంపిక కావడంతో విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా వాకింగ్‌, రన్నింత్‌ పాత్‌, క్రీడా మైదానం ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేస్తారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, సైన్స్‌, కంప్యూటర్‌ విద్య కోసం ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. కిచెన్‌, డైనింగ్‌ హాల్‌, డిజిటలైజ్డ్‌ గ్రంథాలయం అందుబాటులోకి వస్తుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు ఉపాధ్యాయులను నియమిస్తారు. ఈ పాఠశాల నియోజకవర్గ ఆదర్శ పాఠశాలగా ఎంపిక కావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 28 , 2026 | 12:39 AM