Share News

చింతపల్లి రెడ్‌ రాజ్‌మాకు పునర్జీవం

ABN , Publish Date - Jan 16 , 2026 | 10:50 PM

చింతపల్లి రెడ్‌ రకం రాజ్‌మా పంటకు పునర్జీవమిచ్చేందుకు ఆచార్య ఎన్‌జీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మేలిజాతి వంగడాలను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు రెండేళ్లుగా ప్రయోగాత్మక సాగు చేపట్టారు. వచ్చే ఏడాదికి మినీ కిట్స్‌ రూపంలో నాణ్యమైన చింతపల్లి రెడ్‌ రాజ్‌మా విత్తనం అందుబాటులోకి తీసుకురానున్నారు.

చింతపల్లి రెడ్‌ రాజ్‌మాకు పునర్జీవం
పరిశోధన స్థానంలో సాగుచేస్తున్న రాజ్‌మా ప్రయోగాత్మక సాగు(ఫైల్‌)

మేలిజాతి వంగడాల అభివృద్ధికి ప్రయోగాత్మక సాగు

వచ్చే ఏడాది రైతులకు మినీకిట్స్‌

నూతన వంగడాలు ఉత్కర్స్‌,

అరుణ్‌ రకాలపై పరిశోధనలు

చింతపల్లి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాజ్‌మా పంటను ఆదివాసీ రైతులు 45 ఏళ్లుగా వాణిజ్య పంటగా సాగుచేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం వరకు 45 వేల హెక్టార్లలో రాజ్‌మాను సాగుచేసేవారు. ప్రకృతి వైఫరీత్యాల కారణంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది పాడేరు డివిజన్‌ పరిధిలో కేవలం 8,450 ఎకరాల్లో మాత్రమే రాజ్‌మా సాగు చేపట్టారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో గరిష్ఠంగా ఆరు వేల ఎకరాల్లో రాజ్‌మా సాగు జరుగుతున్నది. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రాజ్‌మా పంటకు ఆదివాసీ రైతులు దూరమయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన చింతపల్లి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నూతన రాజ్‌మా వంగడాలపై పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధనలు తుది దశలో ఉన్నాయి.

ఉత్కర్స్‌, అరుణ్‌ రకాలపై పరిశోధనలు

గిరిజన రైతులకు మేలిజాతి వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 2016లో ప్రారంభించిన పరిశోధనలను శాస్త్రవేత్తలు కొనసాగిస్తున్నారు. కాన్పూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ జాతీయ అపరాల పరిశోధన సంస్థ నుంచి ఆరు రకాల రాజ్‌మా విత్తనాలను దిగుమతి చేసుకుని పరిశోధనలు ప్రారంభించారు. ఉత్కర్స్‌, అరుణ్‌ రకాలు ఆశాజనకంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. హెక్టారుకి 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్టు గుర్తించారు. ఈ పరిశోధనలు తుది దశలో వున్నాయి.

చింతపల్లి రెడ్‌ విత్తనంపై పరిశోధనలు

జిల్లాలో చింతపల్లి రెడ్‌లోనూ మేలిజాతి విత్తనాలు అభివృద్ధి చేసేందుకు 2024 ఆగస్టులో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు ప్రారంభించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లను తట్టుకుంటుంది. ఏళ్ల తరబడి ఈ వంగడాన్ని రైతులు సాగు చేస్తుండడంతో నాణ్యమైన విత్తనం రైతులకు అందుబాటులో లేదు. దిగుబడి ఆశాజనకంగా లేదు. దీంతో చింతపల్లి రెడ్‌లో నాణ్యమైన వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న చింతపల్లి రెడ్‌ మేలిజాతి వంగడాలు అందుబాటులోకి వస్తే ఎకరానికి 8-9 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్‌మా గింజలను ప్రైవేటు వర్తకులు రూ.75-85, జీసీసీ రూ.90 ధరలకు కొనుగోలు చేస్తున్నారు.

చింతపల్లి రెడ్‌ మినీకిట్స్‌ పంపిణీ

డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి, ఏడీఆర్‌, ఆర్‌ఏఆర్‌ఎస్‌, చింతపల్లి.

2027 ఖరీఫ్‌ నాటికి గిరిజన రైతులకు రాజ్‌మా చింతపల్లి రెడ్‌ రకం వంగడాలను మినీ కిట్స్‌ రూపంలో అందజేస్తాం. చింతపల్లి రెడ్‌ విత్తనాభివృద్ధి ప్రారంభించాం. గింజ పరిమాణం, నాణ్యత, దిగుబడి, తెగుళ్లు తట్టుకునే స్వభావం కలిగిన విత్తనాలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్నాం. గిరిజన రైతులు రాజ్‌మా సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించాలి.

Updated Date - Jan 16 , 2026 | 10:50 PM