నవజాత శిశువులకు చికిత్సలో చింతపల్లి సీహెచ్‌సీ ప్రథమం
ABN , Publish Date - May 23 , 2026 | 11:16 PM
స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో వైద్యాధికారులు అత్యధిక సంఖ్యలో నవజాత శిశువులకు చికిత్స అందించి రికార్డు సృష్టించారు.
ఎస్‌ఎన్‌సీయూ రికార్డు స్థాయిలో సేవలు
ఉత్తమ ఎస్‌ఎన్‌సీయూగా ప్రశంసా పత్రం
అందజేసిన ఏపీ సెకండరీ హెల్త్ డైరెక్టర్
చింతపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో వైద్యాధికారులు అత్యధిక సంఖ్యలో నవజాత శిశువులకు చికిత్స అందించి రికార్డు సృష్టించారు. తొలి త్రైమాసికానికి రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో నవజాత శిశువులకు ఎస్‌ఎన్‌సీయూలో సేవలందించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈమేరకు చింతపల్లి ఎస్‌ఎన్‌సీయూ వైద్యులు అందిస్తున్న సేవాలను అభినందిస్తూ ఏపీ సెండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చంద్రశేఖరరాబు ప్రశంసా పత్రాన్ని పంపించారు. ఈ ఘనత సాధించిన చింతపల్లి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.నీలవేణి, ఎస్‌ఎన్‌సీయూ ఇన్‌చార్జి గంటా ప్రభావతి, వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. ఏరియా ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని జాతీయ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) సహకారంతో 2016లో ఏర్పాటుచేశారు. 2019 నుంచి ఏరియా ఆస్పత్రి వైద్యులే సేవలందించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నూతన సంస్కరణలకు తెరతీసింది. ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు పిడియాట్రిక్స్ వైద్యులను నియమించింది. దీంతో ఎస్‌ఎన్‌సీయూ ద్వారా శిశువులకు మెరుగైన చికిత్స అందుతున్నది. స్థానిక ఎస్‌ఎన్‌సీయూలో ప్రతీరోజు 70 నుంచి 90 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది తొలిత్రైమాసికం (జనవరి నుంచి మార్చి వరకు) నవజాత శిశువులు 280 మందికి ఎస్‌ఎన్‌సీయూలో మెరుగైన వైద్యసేవలందించారు. క్రిటికల్ పరిస్థితిల్లో వచ్చిన నవజాత శిశువులకు సైతం వైద్యులు అత్యాధునిక వైద్యం అందించి సరంక్షించారు. దీంతో ఎస్‌ఎన్‌సీయూ ద్వారా గిరిజన ప్రాంత నవజాత శిశువులకు కార్పొరేటు స్థాయి వైద్యం ఉచితంగా అందుతుందని ప్రాంతీయ గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా స్థానిక ఎస్‌ఎన్‌సీయూ సేవలపై రాష్ట్ర స్థాయి గుర్తింపు రావడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. నీలవేణి తెలిపారు. చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ గంటా ప్రభావతి, స్టాఫ్‌నర్సులు, దిగువ స్థాయి ఉద్యోగులను సూపరింటెండెంట్ అభినందించారు.