Share News

చింతలవీధి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:06 PM

మండలంలో చింతలవీధి పంచాయతీ కార్యదర్శి జి.అశోక్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి కేపీ.చంద్రశేఖర్‌ ఉత్తర్వులు జారీచేశారు.

చింతలవీధి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

రంగశీల పంచాయతీ కార్యదర్శిగా రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు

ఏడాది క్రితం డీఎల్‌పీవో, ఎంపీడీవో విచారణ

తాజాగా పీజీఆర్‌ఎస్‌లో బాధితుడి ఫిర్యాదు

కలెక్టర్‌ ఆదేశాలతో సస్పెండ్‌ చేసిన డీపీవో

పాడేరు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో చింతలవీధి పంచాయతీ కార్యదర్శి జి.అశోక్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి కేపీ.చంద్రశేఖర్‌ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశాలతో సస్పెండ్‌ చేసినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ కార్యదర్శిగా జి.అశోక్‌కుమార్‌ గతంలో పనిచేశారు. ఆ సమయంలో అక్కడ రికార్డులు ట్యాంపరింగ్‌ చేసి, ఎస్‌.చినరామన్నకు చెందిన ఇంటి (పన్ను అసెస్‌మెంట్‌) స్థలాన్ని తన నాన్నమ్మ జి.దాలమ్మ పేరిట మార్పు చేసేందుకు ప్రయత్నించారని బాధితుడు సాగరి బాలకృష్ణ గతేడాది ఏప్రిల్‌ 24న అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి అశోక్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని డివిజన్‌ పంచాయతీ అఽధికారి, హుకుంపేట మండల పరిషత్‌ అభివృద్ధి అధికారికి కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో విచారణ చేపట్టిన ఎంపీడీవో గతేడాది మే 27, డీఎల్‌పీవో గతేడాది జూలై 21న జిల్లా పంచాయతీ అధికారికి తమ విచారణ నివేధికలను సమర్పించారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ పంచాయతీ కార్యదర్శిపై అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో బాధితుడు సాగర బాలకృష్ణ ఈనెల 17న పీజీఆర్‌ఎస్‌లో మరో మారు ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి, తక్షణమే పంచాయతీ కార్యదర్శిపై చర్యలు చేపట్టాలని డీపీవోకి ఈనెల 18న ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈనెల 21న పంచాయతీ కార్యదర్శి జి.అశోక్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే డీఎల్‌పీవో, ఎంపీడీవో విచారణ నివేధికలను డీపీవోకు సమర్పించినా ఇన్నాళ్లు శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు తాత్సారం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకొని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేయించినందుకు బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:06 PM