రాత్రి వేళ కారడవిలో ప్రసవం
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:42 PM
రాత్రి వేళ కారడవిలో గర్భిణి ప్రసవించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని లుంగపర్తి పంచాయతీ మల్లిపాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడం గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మల్లిపాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేక అవస్థలు
గర్భిణిని డోలీలో ఆరు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సిన దుస్థితి
మార్గమధ్యంలోని అటవీ ప్రాంతంలో ప్రసవించిన వైనం
పీహెచ్‌సీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలింపు
అనంతగిరి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాత్రి వేళ కారడవిలో గర్భిణి ప్రసవించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని లుంగపర్తి పంచాయతీ మల్లిపాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడం గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆ గ్రామానికి చెందిన గోల్లోరి సుమిత్రకు నెలలు నిండడంతో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను లుంగపర్తి పీహెచ్‌సీకి తరలించేందుకు డోలీలో సుమారు ఆరు కిలోమీటర్లు మోసుకువెళుతుండగా మార్గమధ్యంలోని దట్టమైన అటవీప్రాంతంలో నొప్పులు మరింత అధికమయ్యాయి. బుధవారం వేకువజాము మూడు గంటల సమయంలో చీకట్లోనే ఆశా కార్యకర్త, స్థానిక మహిళలు ప్రసవం చేశారు. లుంగపర్తి పీహెచ్‌సీ వైద్యాధికారి మంజుభార్గవికి ఈ విషయం తెలియడంతో వెంటనే స్పందించి సాఫ్ట్ నర్సు ప్రభావతి, అటెండర్ సుబ్బారావును సంఘటన స్థలానికి పంపించారు. సాఫ్ట్ నర్సు, అటెండర్ హుటాహుటిన అక్కడికి చేరుకుని టార్చ్‌లైట్ల వెలుతురులో తల్లీబిడ్డకు ప్రాథమిక చికిత్స చేసి అక్కడ నుంచి లుంగపర్తి పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. సకాలంలో స్పందించిన వైద్య సిబ్బందిని గ్రామస్థులు అభినందించారు. మల్లిపాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఎవరినైనా పీహెచ్‌సీకి తరలించాలంటే డోలీ మోతలు తప్పడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రహ దారి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.