Share News

ఆటోలో ప్రసవం

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:09 AM

జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పెద్దగంగవరం గ్రామానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణి ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఆటోలో ప్రసవం
నిండు గర్భిణిని వాగు దాటిస్తున్న దృశ్యం

పెద్దగంగవరం గ్రామానికి రవాణా సౌకర్యం లేక గర్భిణికి ఇబ్బందులు

వాగు దాటి ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి

ధారకొండ పీహెచ్‌సీ అంబులెన్స్‌ మరమ్మతులకు గురికావడంతో అవస్థలు

సీలేరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పెద్దగంగవరం గ్రామానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చిన్నగంగవరం వద్ద వాగు దాటి ఆటోలో ధారకొండ పీహెచ్‌సీకి వెళుతూ అందులోనే ప్రసవించింది. పీహెచ్‌సీ అంబులెన్స్‌ మరమ్మతులకు గురికావడంతో ఫీడర్‌ అంబులెన్స్‌లో తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు.

పెద్దగంగవరం గ్రామానికి చెందిన నిండు గర్భిణి కొర్రా డొంబాయికు మంగళవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. స్థానిక ఆశా వర్కర్‌తో పాటు కుటుంబ సభ్యులు చిన్నగంగవరం వరకు డొంబాయిని ఆటోలో తీసుకువచ్చారు. అక్కడ వాగు దాటించి మరో ఆటోలో బయలుదేరారు. ఇంతలో డొంబాయికి నొప్పులు అధికమై ఆటోలోనే ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ధారకొండ పీహెచ్‌సీ నుంచి వచ్చిన ఫీడర్‌ అంబులెన్సులో తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. అక్కడ బిడ్డకు వ్యాక్సిన్లు వేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. తమ గ్రామానికి రవాణా సదుపాయం కల్పించడంతో పాటు ధారకొండ పీహెచ్‌సీకి కొత్త అంబులెన్సు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:09 AM