Share News

ఎ.కోడూరుకు ముఖ్యమంత్రి రాక

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:38 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 22వ తేదీకె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించనున్నారు. రానున్న శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది.

ఎ.కోడూరుకు ముఖ్యమంత్రి రాక
ఎ.కోడూరులో సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌పటేల్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా, ఇతర అధికారులు.

22న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో పాల్గొననున్న చంద్రబాబునాయుడు

పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అనకాపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 22వ తేదీకె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించనున్నారు. రానున్న శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎ.కోడూరులో హెలిప్యాడ్‌ నిర్మాణం, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, ప్రత్యామ్నాయంగా జనరేట్లను అందుబాటులో వుంచాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసం వాహనాలను సమకూర్చాలని ఆర్డీఓను ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని ఎస్పీకి సూచించారు.

ఎ.కోడూరులో ఏర్పాట్లు పరిశీలన

కె.కోటపాడు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 22న మండలంలోని ఎ.కోడూరులో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, పలు శాఖల జిల్లాస్థాయి అధికారులు బుధవారం సాయంత్రం ఇక్కడకు వచ్చి హెలిప్యాడ్‌ నిర్మాణం, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పనులకు సంబంధించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎ.కోడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు శనివారం ఎ.కోడూరు గ్రామంలో నిర్వహించే ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారని, తరువాత ప్రజావేదికలో ప్రసంగిస్తారని చెప్పారు. సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హెలిప్యాడ్‌ నిర్మాణం, విద్యుత్‌ సరఫరా, రవాణా, వాహనాల పార్కింగ్‌, తాగునీరు, పారిశుధ్యం, ప్రజావేదిక నిర్వహణ తదితర వాటికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్‌ పర్యటనలో అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్‌ ఆయీషా, వీవీ రమణ, చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:38 AM