Share News

వీఈఆర్‌పై ముఖ్యమంత్రి సమీక్ష

ABN , Publish Date - Jul 07 , 2026 | 01:20 AM

విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం వర్చువల్‌గా వీఎంఆర్‌డీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

వీఈఆర్‌పై ముఖ్యమంత్రి సమీక్ష

విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం వర్చువల్‌గా వీఎంఆర్‌డీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వీఈఆర్‌ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో ప్రతిపాదించిన పనులను కమిషనర్‌ తేజ్‌ భరత్‌ వివరించారు. సిటీ ఎకనామిక్‌ రీజియన్‌ కోసం రూపొందించిన ప్రతిపాదనలు, బే సిటీ గురించి వివరించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్‌ స్థానిక సభ్యులు కిశోర్‌, అదనపు కమిషనర్‌ దాట్ల కీర్తి, ఓఎస్‌డీ కృష్ణనాయక్‌, సెక్రటరీ మురళీకృష్ణ, సీయూపీ దివ్యలత, సీఈ వినయ్‌కుమార్‌, సీఏఓ హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


హెచ్‌ఎంను సాగనంపండి

ఆ ఉపాధ్యాయులను మందలించండి

‘చంద్రంపాలెం పాఠశాల’పై ఆర్జేడీకి నివేదిక

విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):

చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల మధ్య తలెత్తిన వివాదంపై డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు విచారణ పూర్తిచేశారు. అహం (ఇగో) కారణంగానే ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తినట్టు విచారణాధికారి గుర్తించారు. ఈ మేరకు నివేదికను డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌కు అందజేయగా, ఆయన పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్‌కు సమర్పించారు. విశ్వసనీయంగా తెలిసిన వివరాల మేరకు...గత ఏడాది నుంచి హెచ్‌ఎం ఎం.వెంకటరావు, కొందరు టీచర్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. హెచ్‌ఎంను ఉపాధ్యాయ సంఘాల నేతల దన్నుతో కొందరు టీచర్లు లెక్కచేయకపోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో టీచర్లు కొందరు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయడంతో విచారణ బాధ్యతను డిప్యూటీ డీఈవోకు అప్పగించారు. మూడు వేల మంది విద్యార్థులు, 100 మందికిపైగా టీచర్లకు మార్గదర్శనం చేయడంలో హెచ్‌ఎం విఫలమయ్యారని విచారణ సమయంలో పలువురు ఫిర్యాదు చేశారు. వివాదాలకు దూరంగా ఉండే టీచర్లు అక్కడ మొత్తం వ్యవహారాన్ని వివరించినట్టు తెలిసింది. అందరితో మాట్లాడిన తరువాత నివేదిక రూపొందించిన డిప్యూటీ డీఈవో వారి మధ్య ఇగో సమస్య ఉందని పేర్కొన్నట్టు తెలిసింది. సర్దుకుపోయేందుకు చొరవ తీసుకోనందున ఈ సమస్య వచ్చిందని అభిప్రాయపడ్డారని తెలిసింది. రెండు, మూడుసార్లు వివాదాలు చెలరేగిన నేపథ్యంలో హెచ్‌ఎంను బదిలీ చేయాలని, అదే సమయంలో వివాదాలకు కారణమైన కొందరు టీచర్లను గట్టిగా మందలించాలని సూచించినట్టు తెలిసింది. డీఈవో ఇచ్చిన నివేదికను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు ఆర్జేడీ పంపనున్నారు. కాగా గత నెలలో ఒకసారి మెడికల్‌ లీవ్‌ పెట్టిన హెచ్‌ఎం వెంకటరావు, వారం క్రితం మరోసారి అమర్‌నాథ్‌ యాత్ర కోసం సెలవు పెట్టారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ టీచర్‌ సుజాతకు ఇన్‌చార్జి హెచ్‌ఎం బాధ్యతలు అప్పగించారు. అయితే పాఠశాలలో పనిచేయడం ఇష్టం లేకనే హెచ్‌ఎం వెంకటరావు సెలవులో వెళ్లారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని గత వారం ఆర్జేడీ, డీఈవోలను కలిసి చెప్పారంటున్నారు.


ఎండాడ భూ వ్యవహారం..

సర్వే శాఖ డీఐ సరండర్‌

విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):

ఎండాడ సర్వే నంబరు 13/4లో గల ప్రభుత్వ భూమిని సర్వే చేసి ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా నివేదిక రూపొందించిన వ్యవహారంలో సర్వే శాఖకు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ కొండలరావును డైరెక్టరేట్‌కు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ సరండర్‌ చేశారు. రెండు వారాల క్రితం సర్వే శాఖ డీడీ రమణమూర్తిని జేసీ విద్యాధరి సరండర్‌ చేసిన విషయం తెలిసిందే. సర్వే అధికారులు భూమి విస్తీర్ణం, సర్వే నంబరు మాత్రమే నిర్ధారణ చేయాలి తప్ప టైటిల్‌ గుర్తించి ప్రస్తావించకూలేదు. అయినా తనకు సంబంధం లేని పనిలో డీడీ రమణమూర్తి జోక్యం చేసుకుని, డీఐ కొండలరావుతో ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా నివేదిక ఇవ్వడంతో జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. డీడీని సర్వే శాఖ డైరెక్టరేట్‌కు సరెండర్‌ చేశారు. డీఐ కొండలరావుకు షోకాజ్‌ జారీచేశారు. సర్వే అధికారులు చేసిన ఉల్లంఘనలపై సర్వే శాఖ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌కు జేసీ నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో డీఐ కొండలరావును కలెక్టర్‌ సరండర్‌ చేశారు. దీనికి సంబంధించి డైరెక్టరేట్‌ నుంచి సోమవారం సర్వే శాఖ ఏడీకి ఆదేశాలు అందాయి. ఇదిలావుండగా ఎండాడ భూమాయపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలపై సర్వేశాఖ డైరెక్టర్‌ కూర్మనాథ్‌ ఆరా తీస్తున్నారు. సర్వే నంబరు 13/4లో సర్వే నిర్వహించినపుడు ఏమి జరిగిందనేది పూర్తిగా నివేదిక ఇవ్వాలని సర్వే శాఖ ఏడీ రామకృష్ణను ఆదేశించారు.


డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌

20 శాతానికి పడిపోయిన రిజిస్ట్రేషన్లు

విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):

రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన ‘సేవా కేంద్రాల’ ఏర్పాటును నిరసిస్తూ డాక్యుమెంట్‌ రైటర్లు పెన్‌డౌన్‌ చేశారు. సేవా కేంద్రాల ఏర్పాటు వల్ల రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది డాక్యుమెంట్‌ రైటర్లు, వారి సహాయకులకు ఉపాధి పోతుందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. డాక్యుమెంట్‌ రైటర్లు చట్టబద్ధంగా, న్యాయసూత్రాలకు లోబడి డాక్యుమెంట్లను కొన్ని దశాబ్దాలుగా రాస్తున్నారని, ఇప్పుడు కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తే కోట్లాది రూపాయల ఆస్తులకు న్యాయపరమైన చిక్కులు వస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు తగిన రక్షణ ఉండాలంటే సేవా కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

పడిపోయిన రిజిస్ట్రేషన్లు

జిల్లాలో అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజుకు సుమారు 150 వరకు డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అవుతాయి. డాక్యుమెంట్‌ రైటర్ల సమ్మె వల్ల జిల్లాలో సోమవారం కేవలం 32 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్‌ అయ్యాయి.

Updated Date - Jul 07 , 2026 | 01:20 AM