పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమంత్రి కృషి
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:00 AM
రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారిత సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
రూ.24 లక్షల కోట్లు పెట్టుబడులతో పరిశ్రమల స్థాపన
ఏపీ చాంబర్స్ ఎక్స్‌పోను సందర్శించిన మంత్రులు
విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారిత సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎంవీవీకాలనీలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్స్‌పోను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ ద్వారా నిర్వహించే ఎక్స్‌పోలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందనానరు. రెండేళ్ల కూటమి పాలనలో పరిశ్రమల ఏర్పాటు కోసం రూ.24లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటుచేయాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా 19 పార్కులు ఇప్పటికే ప్రారంభించగా 138 పార్కులు నిర్మాణదశలో ఉన్నాయన్నారు. ఈ పార్కులలో 2,876 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించామన్నారు. ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను తయారుచేసి, ఆర్ధిక స్వావలంబన దిశగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎనర్జీ ఎఫీషియన్స్ ద్వారా పార్కులకు ఒప్పందం జరుగుతోందని, ప్రభుత్వ పోర్టల్ ద్వారా బ్యాంకు రుణాలకు ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ పార్కులలో తయారుచేసే ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్లిఫ్‌కార్ట్ అమెజాన్ తదితర సంస్ధలతో ఒప్పందాలు చేస్తున్నామన్నారు.
ఉత్తరాంద్రలో ఇప్పటికే అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, రాష్ట్ర జీడీపీని పెంచాలనే ఆశయంతో ఉన్నామన్నారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే రవాణా రంగం అభివృద్ధి చెందాలని, ప్రతి 150 కిలోమీరట్లకు ఒక పోర్టు, ప్రతి 200 కిలోమీటర్లకు ఒక విమానాశ్రయం, 50 కిలోమీటర్లకు హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించి మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, కలెక్టర్ అభిషిక్త్‌కిశోర్, పోర్టు వైస్‌చైర్మన్ రోష్నీ అపరంజి, చాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ పొట్లూరి భాస్కరరావు, జోన్ ఛైర్మన్ శోభన్ ప్రకాష్, వైస్ ఛైర్మన్ ఎంబీ.పవన్ కార్తీక్, జి,శివకుమార్, శ్రీవల్లి, రావి సుబ్బారావు పాల్గొన్నారు.