Share News

అనకాపల్లి జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:52 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించనున్నారు.

అనకాపల్లి జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో లబ్ధిదారులతో ముఖాముఖి

పార్టీ శ్రేణులతో సమావేశం

అనకాపలి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని, ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి వెలువడింది. దీనిప్రకారం సీఎం చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 8.40 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి పది గంటలకు ఎ.కోడూరు ఎంపీపీ పాఠశాలల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఎంపీపీ పాఠశాల సమీపాన ఏర్పాటుచేసిన వేదిక వద్దకు చేరుకుంటారు. 10.15 గంటల నుంచి 11 గంటల వరకు సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వివిధ వర్గాల ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 11.05 గంటలకు జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో సిద్ధం చేసిన ప్రజా వేదిక వద్దకు చేరుకుని మధ్యాహ్నం 1.15 గంటల వరకు ప్రజలతో మాట్లాడతారు. తరువాత 2.15 గంటల వరకు బస్సులో విశ్రాంతి తీసుకుంటారు. 2.20 గంటల నుంచి 3.50 గంటల వరకు పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, శ్రేణులతో సమావేశవుతారు. నాలుగు గంటలకు విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలానికి బయలుదేరతారు.


భోగాపురం ప్రయాణికుల కోసం 8 బస్‌ బేలు

ఏసీ సౌకర్యంతో పాటు సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ సదుపాయం

ప్రయాణ సమయం తగ్గించేందుకు కృషి

రవాణా, క్రీడల శాఖల మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి

నగరం నుంచి భోగాపురం వరకూ బస్సులో ప్రయాణం

విశాఖపట్నం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఎనిమిది ప్రాంతాల్లో బస్‌ బేలు నిర్మించనున్నట్టు రాష్ట్ర రవాణా, క్రీడల శాఖల మంత్రి ఎం.రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఆర్టీసీ అధికారులతో కలిసి ఏరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్ఫంగా విలేకరులతో మాట్లాడుతూ బస్సులు నిర్ణీత సమయం ప్రకారం నడుస్తున్నాయని, ప్రయాణికులు ధైర్యంగా వీటి కోసం ఎదురుచూడవచ్చునన్నారు. ప్రస్తుతం ప్రయాణ సమయం 1.40 గంటలు పడుతున్నదని, దీనిని తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. అలాగే ప్రయాణికులకు లగేజీ పరమైన ఇబ్బందులు కొన్ని ఉన్నట్టు గుర్తించామని, వాటికి కూడా పరిష్కారం చూపిస్తామన్నారు. బస్‌ బేలలో ఏసీ సౌకర్యంతో పాటు సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ సదుపాయం కల్పించాలని అనుకుంటున్నామన్నారు. ప్రస్తుతం 30 శాతం ఆక్యుపెన్సీతో ఏరో బస్సులు నడుస్తున్నాయని, ఇంకా పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. తక్కువ చార్జీతో సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులో ఉన్నందున వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విశాఖపట్నం రీజనల్‌ మేనేజర్‌ అప్పలనాయుడు, డిప్యూటీ సీటీఎం కె.పద్మావతి, డీసీఎంఈ గంగాధర్‌, డిపో మేనేజర్లు ప్రసాద్‌, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:52 AM