చెరువులవేనం రోడ్డుకి మోక్షం
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:09 PM
ప్రముఖ పర్యాటక కేంద్రం చెరువులవేనం గ్రామానికి రహదారి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. రహదారి నిర్మాణాలకు ఏడాదిన్నర క్రితం రూ.2.4 కోట్ల పీఎం జన్‌మన్ నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే అటవీ శాఖ అభ్యంతరం చెప్పడంతో రోడ్డు నిర్మాణం నిలిచింది. చివరకు వారం రోజుల క్రితం అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. రహదారి నిర్మాణానికి పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు మంజూరు
ఏడాదిన్నర క్రితం రూ.2.4 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
అధ్వానంగా తయారైన రహదారి
చింతపల్లి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లంబసింగికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై ఉన్న చెరువులవేనం గ్రామంలో వాతావరణం విభిన్నంగా ఉంటుంది. శీతాకాలం మంచు మేఘాలు గ్రామాన్ని తాకుతూ పయనిస్తుంటాయి. వ్యూపాయింట్ వద్ద లోయలో మంచు మేఘాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఏడాది నవంబరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులతో జాతర వాతావరణం నెలకొంటుంది.
అధ్వానంగా చెరువులవేనం రహదారి
చెరువులవేనం గ్రామానికి వెళ్లేందుకు లంబసింగి నుంచి కేవలం కాలిబాట మాత్రమే ఉండేది. మూడేళ్ల క్రితం భీమనాపల్లి నుంచి చెరువులవేనం వరకు రూ.80లక్షలతో కనెక్ట్ పాడేరులో భాగంగా మెటల్ రోడ్డు మంజూరైంది. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ గ్రావెల్ రోడ్డు మాత్రమే నిర్మించాడు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా బురదమయమైపోతున్నది. మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్ ప్రారంభం కానున్నది. అటవీ శాఖ అనుమతులు మంజూరు కావడంతో పనులు చేసేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మూడు నెలల్లో పనులు పూర్తి
డి.సురేశ్ రెడ్డి, పీఆర్ డీఈఈ, చింతపల్లి.
చెరువులవేనం-భీమనపల్లి రహదారిని మూడు నెలల్లో పూర్తి చేస్తాం. అటవీ శాఖ అనుమతులు మంజూరు కావడంతో పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ని ఆదేశించాం. నిర్మాణాలకు మూడు నెలల సమయం పడుతుంది. పర్యాటకుల సందర్శనకు ఇబ్బంది కలగకుండా పనులు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం.