Share News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:22 AM

జిల్లాకు ఉత్సవ్‌ శోభ సంతరించుకుంది. రెండు రోజులపాటు నిర్వహించే ‘అనకాపల్లి ఉత్సవ్‌’కు శుక్రవారం ఉదయం అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ వద్ద స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఇతర ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం అనకాపల్లి బెల్లం మార్కెట్‌యార్డులో పుష్ప ప్రదర్శనను ప్రారంభించారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా
కొండకర్ల ఆవలో బోటుపై విహరిస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు సుందరపు విజయ్‌కుమార్‌, ఎంపీ సీఎం రమేశ్‌, కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌

ఘనంగా ప్రారంభమైన అనకాపల్లి ఉత్సవ్‌

కొండకర్ల ఆవ వద్ద ఉత్సవాలకు శ్రీకారం

బోటులో విహరించిన స్పీకర్‌, ప్రజాప్రతినిధులు

ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో ఆకట్టుకొంటున్న ఫ్లవర్‌ షో

ముత్యాలమ్మపాలంలో బీచ్‌ ఫెస్టివల్‌

పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్శకులు

ఎన్టీఆర్‌ స్టేడియంలో యువతను ఉర్రూతలూగించిన గాయని సునీత సంగీత విభావరి

జిల్లాకు ఉత్సవ్‌ శోభ సంతరించుకుంది. రెండు రోజులపాటు నిర్వహించే ‘అనకాపల్లి ఉత్సవ్‌’కు శుక్రవారం ఉదయం అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ వద్ద స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఇతర ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం అనకాపల్లి బెల్లం మార్కెట్‌యార్డులో పుష్ప ప్రదర్శనను ప్రారంభించారు. పువ్వులతో రూపొందించిన వివిధ రకాల ఆకృతులను చూసి సందర్శకులు మంత్రముగ్ధులయ్యారు. సాయంత్రం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో బీచ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. రాత్రి ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రముఖ సినీ గాయని సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి యువతను ఊర్రూతలూగించింది. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఫుడ్‌స్టాల్స్‌ వద్ద రద్దీ నెలకొంది. కాగా ఉత్సవ్‌లో రెండో రోజైన శనివారం రాత్రి 7.30 గంటల నుంచి ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రముఖ సినీ గాయకుడు రామ్‌ మిరియాల ఆధ్వర్యంలో సినీ మ్యూజికల్‌ నైట్‌ను ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు ఉంటాయి.

యువతకు ఉపాధి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర

అనకాపల్లి/అచ్యుతాపురం రూరల్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ర్టాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కొండకర్ల ఆవలో శుక్రవారం ఉదయం స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుతో కలిసి అనకాపల్లి ఉత్సవ్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేస్తామని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవాలతో ఏపీలో పర్యాటక అవకాశాలను చాటిచెప్పామన్నారు. రాష్ర్టానికి సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఎన్నో సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, పలుచోట్ల చారిత్రక చిహ్నాలున్నాయని, వీటన్నింటినీ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నదని చెప్పారు.

కొండకర్ల ఆవకు ఉత్సవ శోభ

అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా కొండకర్ల ఆవ వద్ద శుక్రవారం ఉదయం ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ రమేశ్‌, ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గాలిలోకి బెలూన్లు ఎగురవేశారు. అనంతరం నాటు పడవల్లో ఎక్కి ఆవలో షికారు చేశారు. ఉత్సవ్‌ సందర్భంగా ఇక్కడ ఫుడ్‌ స్టాల్స్‌లో మాడుగుల హల్వా, అరకు కాఫీ అందుబాటులో వుంచారు. ఇంకా ఏటికొప్పాక లక్కబొమ్మలు, పలు రకాల హస్త కళలను ప్రర్శించారు. ఫొటో బూత్‌ వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు సెల్ఫీలు దిగారు. వివిధ రకాల నేలవేషాలు, విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. స్థానికులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఉత్సవ్‌లో ఉల్లాసంగా గడిపారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ కోట్ని బాలాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా, కూటమి నాయకులు దాడి రత్నాకర్‌, సుందరపు సతీష్‌, రాజాన రమేశ్‌కుమార్‌, పీలా తులసీరాం, పిన్నమరాజు వాసు, గొంతిన భక్తసాయిరాం, డ్రీమ్స్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 01:22 AM