Share News

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో క్యాన్సర్లకు చెక్‌

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:24 PM

స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్‌కి కారణమైన హెచ్‌పీవీ వైరస్‌ నివారణకు గార్డాసిల్‌ టీఎం టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో క్యాన్సర్లకు చెక్‌
కోటవురట్ల మండలం కె.వెంకటాపురం పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది (ఫైల్‌)

నాలుగు రకాల క్యాన్సర్లను నిరోధించే గార్డాసిల్‌ టీఎం టీకా

14 ఏళ్లు నిండిన బాలికలకు ఉచితంగా వేస్తున్న ప్రభుత్వం

జిల్లాలో 10,755 మంది బాలికలకు వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యం

అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో కార్యక్రమం

నర్సీపట్నం/ కోటవురట్ల, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్‌కి కారణమైన హెచ్‌పీవీ వైరస్‌ నివారణకు గార్డాసిల్‌ టీఎం టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పీవీ) కారణంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ వస్తుంది. దీన్ని నివారించడానికి 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలకు ఉచితంగా టీకా వేస్తున్నారు. టీకా వేసుకోవడం వలన హెచ్‌పీవీ వైరస్‌ కారణంగా స్త్రీలలో వచ్చే ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

జిల్లాలోని 9 యూపీహెచ్‌లు, 50 పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 14 నిండి 15 ఏళ్లలోపు బాలికలు జనాభాలో 1 శాతం ఉంటారని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 10,755 మంది బాలికలకు టీకాలు అవసరమని అంచనా వేశారు. మొదటి విడతగా 5,910 డోసులు సిద్ధం చేశారు. తరువాత మిగిలిన డోసులు పంపిణీ చేస్తారు. టీకా కార్యక్రమం ఈ నెల 11న ప్రారంభంకాగా, ఇప్పటి వరకు 1,055 మంది బాలికలకు టీకా వేశామని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి చంద్రశేఖర్‌ దేవ్‌ తెలిపారు. మూడు నెలల్లో టీకా కార్యక్రమాన్ని ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

సర్వైకల్‌ క్యాన్సర్‌కు కారణాలు

సర్వైకల్‌ క్యాన్సర్‌ అంటే గర్భాశయ దిగువ భాగంలో ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా ఇన్‌ఫెక్షన్‌ వల్ల అభివృద్ధి చెందే వ్యాధి. సర్విక్స్‌లోని కణాలు అసహజంగా మారి నియంత్రణ లేకుండా పెరగడం వల్ల క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌(టైప్‌ 16, 18) కణాల్లో మార్పు వల్ల క్యాన్సర్‌కు దారి తీస్తుంది. హెచ్‌పీవీ ఎక్కువగా స్కిన్‌ టు స్కిన్‌ కాంటాక్ట్‌ ద్వారా వస్తుంది. వీటితో పాటు చిన్నవయస్సులోనే లైంగిక జీవితం ప్రారంభించడం, ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగి ఉండడం వల్ల హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ సులభంగా వ్యాప్తి చెందుతుంది. మహిళల్లో అధిక శాతం మంది సర్వైకల్‌ క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు వచ్చే అత్యంత ప్రమాదకరమైనది సర్వైకల్‌ క్యాన్సర్‌ అని డాక్టర్లు చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తు తరాలకు ఆరోగ్య భద్రత కల్పించడమే కాకుండా క్యాన్సర్‌ రహిత సమాజ స్థాపనకు పునాది కానున్నదని వైద్యులు చెబుతున్నారు.

వ్యాక్సిన్‌ ఎవరికి వేస్తారంటే..

ఈ వ్యాక్సిన్‌ను 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల వయస్సులోపు బాలికలకు కేవలం ఒక్క డోసు మాత్రమే ఇస్తారు. గతంలో వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి మళ్లీ ఇవ్వరు. నాలుగు రకాల క్యాన్సర్లను ఈ టీకా నిరోధిస్తుందని వైద్యులు చెబుతున్నారు. 0.5 ఎంఎల్‌ను ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వనున్నారు. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో రూ.4 నుంచి రూ.8 వేల వరకు ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సిన్‌కు కనీసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు

గార్డాసిల్‌ టీఎం టీకా వేసుకునే బాలికలు ఖాళీ కడుపుతో ఉండకూడదు. అల్పాహారం, భోజనం చేసి ఉన్నారని నిర్ధారించుకున్న తరువాతే టీకా వేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. టీకా వేసిన తరువాత 30 నిమిషాలు వేచి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. టీకా వేసిన తరువాత తేలికపాటి జ్వరం, టీకా వేసిన చోట నొప్పి, వాపు ఉంటే పారాసిటమాల్‌ టాబ్లెట్‌ ఇవ్వాలని సిబ్బందికి సూచిస్తున్నారు. ఒకవేళ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే ఆస్పత్రిలో ఉంచి వైద్య సేవలు అందించాల్సి ఉంది.

Updated Date - Mar 14 , 2026 | 11:24 PM