ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్
ABN , Publish Date - May 20 , 2026 | 11:39 PM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్రలో భాగంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛరథానికి గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ లభిస్తోంది.
గ్రామాల్లో స్వచ్ఛరథం సేవలు
వ్యర్థాలను సేకరించి నిత్యావసరాలు, నగదు అందజేత
మండలంలో విశేష ఆదరణ
పెదబయలు, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్రలో భాగంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛరథానికి గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. గ్రామాలను పరిశుభ్రంగా మార్చడంతో పాటు ప్లాస్టిక్ నిర్మూలనకు ఈ రథాలు దోహదపడుతున్నాయి. మండలంలోని 23 పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛరథం తిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తోంది.
ప్లాస్టిక్ నియంత్రణ, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గ్రామాల్లో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఇతర వ్యర్థాలను రోడ్ల పక్కన, కాలువల్లో, ఖాళీ ప్రదేశాల్లో పడేయడంతో దుర్వాసన, దోమల వ్యాప్తి, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. ప్రధానంగా వారపు సంతలు జరిగే పెదబయలు, రూఢకోట, గోమంగి గ్రామాల్లో చెత్త నిర్వహణ పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంతి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పవన్‌కల్యాణ్ ప్రత్యేక ప్రణాళికతో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛరథాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజల నుంచి ప్లాస్టిక్, పాత పుస్తకాలు, ఇనుప సామగ్రి, తదితర వస్తువులను కిలోల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. బరువును బట్టి నిత్యావసరాలు ఇవ్వడం, లేదా నగదు చెల్లిస్తున్నారు. స్వచ్ఛరథం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని అవగాహన కల్పిస్తున్నారు.