15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగానికి చెక్
ABN , Publish Date - Mar 03 , 2026 | 01:32 AM
స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ క్షేత్రాలు, పశువుల శాలలు, కల్లాల్లో బోర్లు వేయించుకున్న నేతలు, వారి అనుయాయులు
కూటమి వచ్చిన తరువాత బ్రేక్
పాఠశాలలు, జనావాసాల మధ్య మాత్రమే బోర్లు వేయాలని ఉత్తర్వులు
నెలాఖరులోగా పనులు పూర్తికి ఆదేశాలు
విశాఖపట్నం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచింది. నిర్దేశిత రంగాలకు చెందిన పనులకు మాత్రమే ఆ నిధులు వెచ్చించాలని ఇప్పటికే స్పష్టంచేసింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు, వారి అనుయాయులకు చెందిన వ్యవసాయ క్షేత్రాలు, పశువులశాలలు, ప్రధానంగా కల్లాల్లో బోర్లు నిర్మాణానికి నిధులు మంజూరుచేసుకున్నారు. ఆ విధంగా నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాగునీటి అవసరాలు తీర్చడం అంటే ప్రజల నివాసాల మధ్య బోర్లు నిర్మించాలి. ఆ నిబంధనను ఉల్లంఘించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిపై ఆంక్షలు విధించింది. దీంతో జడ్పీ సాధారణ సమావేశాలు, స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పలువురు సభ్యులు కల్లాల్లో బోర్లు మంజూరుచేయాలని కోరినా అధికారులు తిరస్కరించారు.
కేంద్రం మంజూరుచేసిన 15వ ప్రస్తుత ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను నెలాఖరులోగా పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు...రూ.1311.1 లక్షలతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 358 పనులు ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా విశాఖ జిల్లాలో రూ.116 లక్షలతో 17 పనులు, అనకాపల్లి జిల్లాలో రూ.272.6 లక్షలతో 63 పనులు, అల్లూరి జిల్లాలో రూ.216 లక్షలతో 54 పనులు చేపట్టారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా విశాఖ జిల్లాలో రూ.137 లక్షలతో 42, అనకాపల్లి జిల్లాలో రూ.421.4 లక్షలతో 140 పనులు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.146.6 లక్షలతో 42 పనులు మంజూరుచేశారు. రెండు విభాగాల్లో ఇప్పటివరకూ 168 పనులు పూర్తిచేయగా, మరో 160 పనులు పురోగతిలో ఉన్నాయి. మరో 30 పనులు ఇంతవరకూ ప్రారంభం కాలేదు.
జిల్లా పరిషత్‌కు వచ్చే సాధారణ నిధుల నుంచి రూ.955.58 లక్షలతో 228 పనులు ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిధిలో విశాఖ జిల్లాలో రూ.176.75 లక్షలతో 19 పనులు, అనకాపల్లి జిల్లాలో రూ.228.98 లక్షలతో 58, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.164.6 లక్షలతో 40 పనులు మంజూరుచేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిధిలో రూ.90.1 లక్షలతో 23, అనకాపల్లి జిల్లాలో 157.95 లక్షలతో 53, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.136.68 లక్షలతో 35 పనులు మంజూరుచేశారు. ఇప్పటివరకూ రెండు విభాగాల్లో కలిపి 65 పనులు పూర్తికాగా, 151 పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 12 ఇంతవరకూ ప్రారంభించలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులతో సామాజిక భవనాలు, పాఠశాలలు, జనావాసాల మధ్య, ఇంకా పంచాయతీల ఆధ్వర్యంలో నడుస్తున్న మంచినీటి పథకాలకు అవసరమని గుర్తించినచోట మాత్రమే బోర్లు వేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే జడ్పీ సాధారణ నిధులను పంచాయతీలు నిర్వహించే తాగునీటి పథకాల నిర్వహణ, మరమ్మతులు, గ్రామాలు, మండలాల మధ్య రోడ్ల అనుసంధానానికి మాత్రమే వెచ్చించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. ఆర్థిక సంఘం, సాధారణ నిధులతో చేపట్టే పనులను నెలాఖరులోగా పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈలకు ఆదేశించామని జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు.