గంజాయికి చెక్
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:57 AM
నగరంలో గంజాయి రవాణా, విక్రయానికి పూర్తిగా అడ్డుకట్ట వేయడంపై పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి దృష్టిపెట్టారు.
స్మగ్లర్ల మూలాలపై నగర పోలీస్ కమిషనర్ దృష్టి
రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలులో ఉన్న నిందితుల నుంచి సమాచారం సేకరణ
న్యాయస్థానం అనుమతులతో సాగుతున్న ప్రక్రియ
కారాగారంలో సుమారు 50 మంది...ఇప్పటికే 23 మంది నుంచి వివరాలు రాబట్టిన ప్రత్యేక సిబ్బంది
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో గంజాయి రవాణా, విక్రయానికి పూర్తిగా అడ్డుకట్ట వేయడంపై పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి దృష్టిపెట్టారు. ఇందుకోసం గంజాయి కేసుల్లో అరెస్టు అయ్యి...రిమాండ్ నిమిత్తం జైల్లో ఉన్న నిందితుల నుంచి స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న మాస్టర్‌మైండ్స్ గురించిన సమాచారం రాబడుతున్నారు. జైలులో ఉంటున్న నిందితులును ఇంటరాగేషన్ చేసేందుకు న్యాయపరమైన అనుమతులు తీసుకుంటున్నారు. అనంతరం ప్రత్యేక పోలీసులను జైలుకు పంపించి స్మగ్లర్ల వివరాలను సేకరిస్తున్నారు. వారికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది?, ఎవరు అందజేశారు?, రవాణా ఎలా?, వసతి సదుపాయం కల్పించిన వారెవరు?, ఆర్థిక సహాయం ఎలా అందుతుంది?, గంజాయిని ఎవరికి, ఎక్కడ అందజేయాలని చెప్పారు?, ఆ ఆదేశాలు ఎవరు ఇస్తారు?, చివరకు గంజాయి ఎక్కడకు చేరుతుంది?...అనే వివరాలను ప్రత్యేక పోలీసులు సేకరిస్తున్నారు.
గంజాయి కేసుల్లో జైలులో గడుపుతున్నవారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరించే మాస్టర్‌మైండ్‌లు, కింగ్‌పిన్‌లకు చెక్ చెప్పాలని సీపీ భావిస్తున్నారు. అడవివరంలోని కేంద్ర కారాగారంలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడినవారు (కొరియర్‌లు) సుమారు 50 మంది ఉన్నారు. వారిలో 23 మందిని ఇప్పటికే సీపీ నియమించిన ప్రత్యేక పోలీసులు విచారించారు. న్యాయపరమైన అనుమతులు వచ్చిన తర్వాత మిగిలిన వారిని కూడా దశల వారీగా విచారించనున్నారు. ఇదిలావుండగా ఇప్పటికే నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్మగ్లర్లను పట్టుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలిసింది.
స్మగ్లింగ్ చైన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తే వారిని అప్రూవర్‌లుగా మార్చి న్యాయస్థానంలో శిక్ష తగ్గేలా తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇస్తే జైల్లో మగ్గుతున్నవారు వాస్తవ సమాచారం ఇచ్చేందుకు ముందుకొస్తారని పోలీసులు చెబుతున్నారు. జైలులో ఉన్నవారిని విచారించడం గురించి సీపీ శంఖబ్రతబాగ్చి వద్ద ప్రస్తావించగా ఆ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందన్నారు. సుమారు 15 డ్రోన్‌లతో గంజాయి హాట్‌స్పాట్‌ల గుర్తింపు, ఒడిశా నుంచి నగరానికి వచ్చే బస్సుల తనిఖీ, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు నిర్వహణ, తొమ్మిది స్నిఫర్‌డాగ్‌లతో చెకింగ్ చేస్తున్నాసరే గంజాయి రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నామన్నారు. గత ఏడాది 226 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో గంజాయి కేసుల్లో నిందితుల నుంచే స్మగ్లింగ్ చైన్ లింక్‌లను గుర్తించగలిగితే మూలాలతో సహా పెకలించవచ్చునని ఆశాభావం వ్యక్తంచేశారు.