గోవుల అక్రమ రవాణాకు చెక్
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:08 AM
గోవుల అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనున్నది.
పశువుల రవాణాకు ట్రాన్స్‌పోర్టు సర్టిఫికెట్ తప్పనిసరి
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఆ సర్టిఫికెట్ లేకపోతే క్రిమినల్ కేసు నమోదుకు రవాణా, పోలీస్ శాఖలకు అనుమతి
విశాఖ కేంద్రంగా నిత్యం వందలాది గోవుల వధ
ఇప్పుడైనా అడ్డుకట్టపడుతుందని హిందూ సంఘాల ఆశాభావం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
గోవుల అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనున్నది. అనుమతులు లేకుండా గోవులను తరలించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. గోవులను రవాణా చేయాలంటే ఇక నుంచి తప్పనిసరిగా పశు సంవర్ధక శాఖ అధికారుల నుంచి ‘డిజిటల్ ట్రాన్స్‌పోర్టు సర్టిఫికెట్’ పొందాలన్న నిబంధన విధించింది. ఇందుకోసం ‘డిజిటల్ ట్రాన్స్‌పోర్టు సర్టిఫికెట్ జనరేషన్ సిస్టం’ను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల పశువుల అక్రమ రవాణాతోపాటు గోవధకు అడ్డుకట్టపడుతుందని హిందూ సంఘాలు, గోపరిరక్షణ సంఘాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గోవుల అక్రమ రవాణా, కబేళాలకు తరలింపు యథేచ్ఛగా సాగుతున్నాయి. గోవులను చంపడానికి వీల్లేదని, కేవలం ఎద్దులు, గేదెలు, దున్నలు వంటి వాటిని ప్రభుత్వ వైద్యుడి పర్యవేక్షణలో అనుమతించిన కబేళాలో మాత్రమే వధించాలని స్పష్టమైన నిబంధన ఉంది. అయితే కొంతమంది డబ్బు సంపాదనే పరమావధిగా ఎద్దులు, గేదెలు, దున్నలతోపాటు ఆవులను కూడా అక్రమంగా కబేళాలకు తరలిస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే క్రమంలో నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. వాహనాల్లో ఆవులను కిక్కిరిసి ఎక్కించి, గమ్యస్థానం చేరేంత వరకూ వాటికి నీరు, ఆహారం ఇవ్వడం లేదు. దీంతో ఊపిరాడక, గొంతు ఎండిపోయి కొన్ని మార్గమధ్యంలోనే మృత్యువాత పడుతున్నాయి.
ఉత్తరాంధ్రలోని పలు సంతల్లో దళారులు ఆవులను కొనుగోలు చేసి మినీ వ్యాన్‌లలో విశాఖ నగరానికి రవాణా చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఆయా సంతల నుంచి రాత్రి పది గంటల తరువాత బయలుదేరి, తెల్లవారుజామున మూడు గంటల్లోపు గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనంతరం వాటిని జనావాసాల మధ్యనే వధించి, గుట్టుచప్పుడు కాకుండా మాంసాన్ని పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. హిందువులు పరమపవిత్రంగా భావించే గోవులను హింసించడం, వధించడంపై హిందూత్వ సంఘాలతోపాటు గోపరిరక్షణ సంఘాల ప్రతినిధులు పోరాటం చేస్తున్నాయి. గోవులను రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు. అయితే గోవుల రవాణా వెనుక బడా వ్యాపారులతో కూడిన మాఫియా ఉండడంతో...పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి, తిరిగి కబేళాలకు తరలించేలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రజల నుంచి విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గోవుల అక్రమ రవాణా, వధకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలను విధించాలని నిర్ణయించింది.
డిజిటల్ ట్రాన్స్‌పోర్టు సర్టిఫికెట్ తప్పనిసరి
ఇకపై గోవులతోపాటు ఇతర పశువులను వాహనాల్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించాలంటే పశు సంవర్ధక శాఖ జారీచేసే ‘డిజిటల్ ట్రాన్స్‌పోర్టు సర్టిఫికెట్’ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎవరైనా పశువులను రవాణా చేయాలంటే ముందుగా పశువుల సంఖ్య, వాటి వివరాలతోపాటు వాహనం నంబర్, సమయం, ఎక్కడి నుంచి ఎక్కడకు తీసుకువెళుతున్నారనే వివరాలను పశు సంవర్ధక శాఖకు అందజేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను పరిశీలించిన తర్వాత రవాణాకు అనుమతిస్తూ ‘డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్’ను జారీచేస్తుంది. ఆ సర్టిఫికెట్‌ను ప్రింట్ తీసుకుని లేదా మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వాహనంతోపాటు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మార్గమధ్యంలో పోలీసులు, రవాణాశాఖ అధికారులు అడిగితే ఆ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ సర్టిఫికెట్ తీసుకోకుండా పశువులను రవాణా చేస్తే పోలీస్, రవాణా శాఖ అధికారులు కేసు నమోదుచేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో ఉత్తరాంధ్రలో పశువుల అక్రమ రవాణాకు, గోవధకు అడ్డుకట్టపడుతుందని హిందూత్వ సంఘాలు, గోపరిరక్షణ సంఘాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.