భూ అక్రమాలకు చెక్
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:33 AM
భూ అక్రమాలకు చెక్
ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు
స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడి
రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని ధ్వజం
నర్సీపట్నం మార్కెట్ యార్డులో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
నర్సీపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): భూ రికార్డుల ట్యాంపరింగ్, ఒకరి భూమి మరొకరి పేరున రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంటి అక్రమాలకు తావు లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేస్తున్నదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. శుక్రవారం పెదబొడ్డేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, పట్టాదారు పాస్‌పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫొటోలు ఉండకూడదన్న ఉద్దేశంతో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఅధికారిక రాజముద్ర’తో కొత్తగా పాస్‌పుస్తకాలను ముద్రిస్తున్నదని తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ పాస్‌పుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి భూమి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మార్చేసిందని, రైతులకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫొటోలను ముద్రించిందని ధ్వజమెత్తారు. రైతులు పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం తహశీల్దారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సమీపంలోని గ్రామ/ వార్డు సచివాలయాల్లో పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి లాలం శ్రీరంగ స్వామి, జనసేన నియోజకవర్గం ఇన్‌చార్జి సూర్యచంద్ర, ఏఎంసీ చైర్మన్ వెంకటరమణ, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, ఆర్డీవో వీవీ రమణ, తహశీల్దార్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ ప్రారంభం
అనకాపల్లి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గత ప్రభుత్వం అప్పటి సీఎం జగన్ ఫొటోతో జారీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల స్థానంలో కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ శుక్రవారం ప్రారంభమైంది. మొత్తం 375 గ్రామాల్లో 2,01,841 మంది భూ యజమానులకు ఈ నెల 9వ తేదీలోగా వీటిని అందజేస్తారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం (పెదబొడ్డేపల్లి) వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగినకార్యక్రమంలో పలువురు రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు. కలెక్టర్ విజయకృష్ణన్ అనకాపల్లి మండలం గోపాలపురం, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నియోజకవర్గంలోని పులపర్తి, చూచుకొండ గ్రామాల్లో; చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు తన నియోజకవర్గం పరిధిలోని కొండపాలెం, ఐతంపూడిలో, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఎల్‌బీ పట్నం, పొంగలిపాక గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలిరోజు సుమారు వెయ్యి మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు.