తూకాల్లో మోసాలకు చెక్!
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:24 AM
ఏజెన్సీలో రోజూ ఏదో ఒకచోట వారపు సంత జరుగుతుంటుంది. చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు తమ వ్యవసాయ, ఉద్యాన, అటవీ ఉత్పత్తులను ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో తూకాలపై తగిన అవగాహన లేకపోవడంతో వర్తకులు వారిని మోసగిస్తుంటారు. ఈ సమస్య చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. తూనిక రాళ్ల స్థానంలో డిజిటల్ కాటాలు వచ్చిన తరువాత కూడా తూకంలో మోసాలు జరుగుతూనే వున్నాయి.
వారపు సంతల్లో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు
నెల రోజుల్లో 54 కేసులు నమోదు
రూ.1.57 లక్షల జరిమానా
నిరంతరం తనిఖీలు కొనసాగించాలని గిరిజనుల వినతి
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీలో రోజూ ఏదో ఒకచోట వారపు సంత జరుగుతుంటుంది. చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు తమ వ్యవసాయ, ఉద్యాన, అటవీ ఉత్పత్తులను ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో తూకాలపై తగిన అవగాహన లేకపోవడంతో వర్తకులు వారిని మోసగిస్తుంటారు. ఈ సమస్య చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. తూనిక రాళ్ల స్థానంలో డిజిటల్ కాటాలు వచ్చిన తరువాత కూడా తూకంలో మోసాలు జరుగుతూనే వున్నాయి. తాము ఇంటి వద్ద తూకం వేసిన దానికన్నా, సంతలో తూకం వేసినప్పుడు తక్కువ బరువు చూపిస్తున్నదంటూ పలువురు గిరిజనులు, ఆయా వ్యాపారులతో వాదనకు దిగుతున్నారు. దీంతో తూనికలు, కొలతల శాఖా అధికారులు కొద్ది రోజుల నుంచి వారపు సంతల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. గత నెల రోజుల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు మూడు బృందాలతో తనిఖీలను ముమ్మరం చేసి, మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి మొత్తం 54 కేసులను నమోదు చేశారు. వారి నుంచి రూ. లక్షా 57 వేలు జరిమానా వసూలు చేశారు. పెదబయలు సంతలో ఏడు కేసులు, అరకులోయలో 5, ముంచంగిపుట్టులో 13, హుకుంపేటలో 11, జీకేవీధిలో 3, కించుమండలో 10, కాశీపట్నం సంతలో 5 కేసులు నమోదు చేశారు. దీంతో వర్తకులు తూకంలో మోసాలకు పాల్పడాలంటే భయపడుతున్నారు. అయితే సంతల్లో తనిఖీలను మొక్కుబడిగా కాకుండా నిరంతరం కొనసాగించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.