Share News

విద్యుత్‌ కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:57 AM

చోడవరంలో విద్యుత్‌ లోవోల్టేజీ, ఇతర సమస్యలను తొలగించేందుకు లక్ష్మీపురం పంచాయతీ శివారులో చేపట్టిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి పంచాయతీలకు విద్యుత్‌ సరఫరా కోసం విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఈ నెలలోనే ప్రారంభిస్తారని సమాచారం.

విద్యుత్‌ కష్టాలకు చెక్‌
లక్ష్మీపురం సమీపంలో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

లక్ష్మీపురంలో పూర్తయిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌

ఈ నెలలోనే ప్రారంభానికి సన్నాహాలు

పలు పంచాయతీలకు తొలగనున్న విద్యుత్తు సమస్యలు

చోడవరం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): చోడవరంలో విద్యుత్‌ లోవోల్టేజీ, ఇతర సమస్యలను తొలగించేందుకు లక్ష్మీపురం పంచాయతీ శివారులో చేపట్టిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి పంచాయతీలకు విద్యుత్‌ సరఫరా కోసం విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఈ నెలలోనే ప్రారంభిస్తారని సమాచారం.

చోడవరంతోపాటు చుట్టు పక్కల వున్న మరో తొమ్మిది పంచాయతీలకు ఒకే ఒక్క విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వుండడంతో వినియోగదారులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. లోఓల్టేజీ సమస్యతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లపై లోడు పెరిగిపోతే ట్రిప్‌ అవుతున్నాయి. దీంతో విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతున్నది. విద్యుత్‌ కనెక్షన్లతోపాటు విద్యుత్‌ వినియోగం కూడా రోజు రోజుకీ పెరిగిపోతుండడంతో ఈ సమస్య మరింత అధికం అవుతున్నది. వేసవిలో విద్యుత్‌ వినియోగం గరిష్ఠస్థాయికి చేరితే అధిక లోడుతో ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్‌ అయ్యేవి. దీంతో కొన్నిసార్లు రాత్రిపూట గంటల తరబడి విద్యుత్‌ సరఫరా లేని పరిస్థితి నెలకొంటున్నది. దీనిని నివారించడానికి మరో సబ్‌స్టేషన్‌ నిర్మించాలని వినియోగదారులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. గత తెలుగుదేశం హయాంలోనే 33/11 కేవీ విద్యుత్‌ స్టేషన్‌ మంజూరుకాగా, తరువాత వచ్చిన వైసీపీ పాలకులు సబ్‌స్టేషన్‌కు కేటాయించిన స్థల వివాదాన్ని పరిష్కరించలేదు. మళ్లీ టీడీపీ ఆధ్వర్యంలో కూటమి అధికారంలోనికి వచ్చిన తరువాత ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు నిధులు మంజూరు చేయించారు. దీనిని నిర్మాణానికి లక్ష్మీపురం సమీపంలో స్థలం సమకూర్చారు. టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి, యుద్ధప్రాతిపదికను పనులు చేయించారు. ఈ సబ్‌స్టేషన్‌ను చీడికాడ రోడ్డులో ఉన్న మరో సబ్‌స్టేషన్‌తో అనుసంధానం చేశారు. కొత్త సబ్‌ స్టేషన్‌ ద్వారా నరసయ్యపేట, గౌరీపట్నం, లక్ష్మీపురం, గాంధీగ్రామం పంచాయతీకు, ఇప్పటికే వున్న సబ్‌స్టేషన్‌ ద్వారా చోడవరం, అంకుపాలెం, శ్రీరాంపట్నం, ఖండేపల్లి, దామునాపల్లి, మైచర్లపాలెం, పీఎస్‌పేట పంచాయతీలకు విద్యుత్‌ సరఫరా అవుతుంది. కొత్త సబ్‌స్టేషన్‌ను మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని, దీంతో పలు పంచాయతీలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:57 AM