Share News

అధ్వానంగా చౌడుపల్లి-పశువులబంద రహదారి

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:12 PM

మండలంలోని చౌడుపల్లి-పశువులబంద ప్రధాన రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పూర్తిగా ఛిద్రమైంది. రహదారి ఆనవాళ్లు కనిపించడం లేదు. రోడ్డుపై ఏర్పడిన గోతులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రాంతీయులు రాకపోకలను సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.

అధ్వానంగా చౌడుపల్లి-పశువులబంద రహదారి
పశువులబంద సమీపంలో ఆనవాళ్లులేని రహదారి

వర్షాలకు ఛిద్రం..

అవస్థలు పడుతున్న ఆదివాసీలు

ఆర్టీసీ బస్సు సర్వీసు రద్దు

పట్టించుకోని పాలకులు, అధికారులు

చింతపల్లి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చౌడుపల్లి-పశువులబంద నాలుగు కిలోమీటర్ల రహదారి పూర్తిగా పాడైపోయింది. గత వైసీపీ ప్రభుత్వం కనీసం రహదారిపై ఏర్పడిన గోతులను పూడ్చలేదు. పలుమార్లు ఆదివాసీలు వైసీపీ పాలకులు, అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కనీసం ఒక్కరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం అడుగడుగునా గోతులు ఏర్పడ్డాయి. ఆటోలు, కార్లు ప్రయాణిస్తుంటే నేలకు తగులుతున్నాయి. ఏడాది క్రితం పంచాయతీ నిధులతో గోతులను మట్టితో పూడ్చారు. వేసవిలో సమస్య లేకపోయినా, వర్షాకాలం రహదారి బురదమయమైపోయి వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోతులను పూడ్చిన మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి పూర్తిగా పాడైపోవడంతో ఐదేళ్ల క్రితం ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసు రద్దుచేశారు. రహదారి నిర్మాణం జరిగే వరకు ఆర్టీసీ బస్సును పునరుద్ధరించలేమని అధికారులు చేతులెత్తేశారు. ఈ రోడ్డు గుండా 30 గ్రామాల ఆదివాసీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి పరిస్థితి దారుణంగా ఉండడంతో ప్రైవేటు సర్వీసు వాహనాలు సైతం తిరగడంలేదు. దీంతో ప్రాంతీయ ప్రజలు కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా చౌడుపల్లి-పశువులబంద రహదారి నిర్మాణంపై ఎటువంటి కదలిక కనిపించలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రాంతీయులు కోరుతున్నారు.

Updated Date - Jun 12 , 2026 | 11:12 PM