Share News

స్వచ్ఛంద సంస్థలకు శ్మశానాల నిర్వహణ బాధ్యత

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:24 AM

నగరంలోని కొన్ని శ్మశానవాటికల నిర్వహణను స్వచ్ఛంద సంస్థలు, నివాసిత సంఘాలకు అప్పగించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం జరిగే స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునేందుకు వీలుగా అజెండాలో చేర్చారు. 22వ వార్డు పరిధిలోని పీతలవానిపాలెం శ్మశానవాటికను శ్రీకృష్ణ యువజనసంఘం, శివాజీపాలేనికి చెందిన శ్రీకృష్ణసేవా సంఘం సంయుక్తంగా నిర్వహించుకునేందుకు జీవీఎంసీకి దరఖాస్తు చేశాయి.

స్వచ్ఛంద సంస్థలకు శ్మశానాల నిర్వహణ బాధ్యత

తాత్కాలిక ప్రాతిపదికన అదనపు పారిశుధ్య కార్మికుల నియామకం

నేడు స్టాండింగ్‌ కమిటీ సమావేశం

159 అంశాలతో అజెండా

విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని కొన్ని శ్మశానవాటికల నిర్వహణను స్వచ్ఛంద సంస్థలు, నివాసిత సంఘాలకు అప్పగించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం జరిగే స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునేందుకు వీలుగా అజెండాలో చేర్చారు. 22వ వార్డు పరిధిలోని పీతలవానిపాలెం శ్మశానవాటికను శ్రీకృష్ణ యువజనసంఘం, శివాజీపాలేనికి చెందిన శ్రీకృష్ణసేవా సంఘం సంయుక్తంగా నిర్వహించుకునేందుకు జీవీఎంసీకి దరఖాస్తు చేశాయి. అలాగే సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్‌, టీపీటీ కాలనీల్లోని ఐదు శ్మశానవాటికల నిర్వహణకు రోటరీ క్లబ్‌ ముందుకొచ్చింది. వీటిని పరిశీలించిన అధికారులు వారి నుంచి రూ.50 వేలు చొప్పున సెక్యూరిటీ డిపాజిట్‌ కట్టించుకోవడంతోపాటు అంతిమ సంస్కారం నిర్వహించేవారి నుంచి రూ.3,500కి మించకుండా వసూలు చేసుకుంటూ, మూడేళ్లపాటు నిర్వహణ బాధ్యతను అప్పగించే అంశాన్ని అజెండాలో చేర్చారు. ఇంకా, నగరంలోని నైట్‌షెల్టర్ల నిర్వాహకులకు కాలపరిమితి పెంపు, ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌ కార్యక్రమాలు వచ్చే నెలలో జరగబోతున్నందున పారిశుధ్య నిర్వహణకు తాత్కాలిక ప్రాతిపదికన అదనపు కార్మికులను తీసుకోవడం, ఉద్యోగ విరమణ, మరణాలు వల్ల ఖాళీ అయిన పారిశుధ్య కార్మికుల స్థానంలో తాత్కాలికంగా సిబ్బందిని విధుల్లోకి తీసుకునే అంశాలను చేర్చారు. ప్రతి బడ్జెట్‌ సమావేశం సందర్భంగా కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు, కో-ఆప్షన్‌ సభ్యులు, విభాగాల అధిపతులకు కూపన్లు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రూ.25 వేల విలువైన కూపన్ల పంపిణీకి అనుమతి కోసం స్టాండింగ్‌ కమిటీకి ప్రతిపాదించారు. అదేవిధంగా నగరంలోని ఆరు కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ మరమ్మతు, 68వ వార్డు పరిధిలోని పెద్దచెరువు గట్టుపై వాకింగ్‌ ట్రాక్‌, లైటింగ్‌ ఏర్పాటుకు రూ.34.7 లక్షలు ఖర్చుచేసేందుకు అనుమతి కోసం ప్రతిపాదించారు. ఐఎఫ్‌ఆర్‌ కోసం నగరంలో పలుచోట్ల రోడ్ల నిర్మాణం, పెయింటింగ్‌ పనుల కోసం ప్రతిపాదించారు. వివిధ వార్డుల్లో డ్రెయిన్లు, కల్యాణ మండపాల నిర్మాణంతోపాటు ఉద్యోగుల సర్వీస్‌ మేటర్‌కు సంబంధించిన అంశాలను అజెండాలో చేర్చారు.

Updated Date - Jan 28 , 2026 | 01:24 AM