పదోన్నతులపై పితలాటకం
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:29 AM
స్టీల్ ప్లాంటు యాజమాన్యం ఉద్యోగుల ఉసురు పోసుకుంటోంది.
లాభాలు వస్తేనే ఇస్తాం
ఉక్కు యాజమాన్యం వితండ వాదన
కావాలంటే వేతనం పెంపు లేకుండా ఇస్తామని మెలిక
ఐదారేళ్లుగా నిలిపివేత
హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగ సంఘాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్ ప్లాంటు యాజమాన్యం ఉద్యోగుల ఉసురు పోసుకుంటోంది. ఎక్కడెక్కడి నుంచో పదోన్నతులపై ఇక్కడకు సీఎండీలుగా, డైరెక్టర్లుగా వస్తున్న పెద్దలు స్థానిక అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. ప్లాంటు నష్టాల్లో ఉందని, లాభాల్లోకి వస్తే అప్పుడు చూస్తామని చెబుతున్నారు. లేదు...ఇప్పుడే కావాలనుకుంటే పేపర్లపై మాత్రమే ప్రమోషన్లు ఇస్తామని, వాటికి తగిన ఆర్థిక ప్రయోజనాలు ఏమీ ఇవ్వలేమంటున్నారు.
స్టీల్ ప్లాంటులో ఈ5 అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నుంచి ఈ9 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు పదోన్నతులను 2020 తరువాత ఆపేశారు. ఈ2 డిప్యూటీ మేనేజర్ల నుంచి ఈ4 సీనియర్ మేనేజర్ల వరకు ప్రతి మూడేళ్లకు పదోన్నతి ఇవ్వాలి. ఉద్యోగులపై ఎటువంటి కేసులు లేకపోతే పనితీరుతో సంబంధం లేకుండా ప్రమోషన్ ఇవ్వాలి. వీటిని కూడా 2021 నుంచి నిలిపివేశారు. 2019లో జనరల్ మేనేజర్ పదోన్నతుల్లో అవకతవకలు జరిగాయని అప్పట్లో కొంతమంది సీబీఐని ఆశ్రయించారు. దీనిపై శాఖాపరమైన విచారణ చేసి తొమ్మిది మందిని దోషులుగా తేల్చి కేసు నమోదుచేశారు. లోపాలు ఉన్నప్పుడు సవరించుకుని మరింత పారదర్శకంగా నిర్వహించాల్సింది పోయి ఆ కేసును సాకుగా చూపించి ఏకంగా పదోన్నతులే ఆపేశారు. పోనీ దోషులపై చర్యలు తీసుకున్నారా?...అంటే అదీ లేదు. నిందితుల్లో ఒకరు కేసు నుంచి మినహాయింపు తెచ్చుకొని ఆయనకు రావలసిన బకాయిలన్నీ తీసుకుని వెళ్లిపోయారు. అదేవిధంగా అడ్డగోలుగా పదోన్నతి పొందారనే ఆరోపణ ఎదుర్కొన్న మరొకరు ప్రస్తుతం ఆ విభాగం అధిపతిగా కొనసాగుతున్నారు. ఆ కేసు కారణంగా సుమారు 4,500 మంది అధికారులు ఇప్పటికీ పదోన్నతి లేకుండా ఉండిపోయారు. పదోన్నతులు ఇవ్వడం లేదని కొందరు రాజీనామాలు చేసి వేరే ఉద్యోగాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం ప్లాంటులో 2,300 మంది (డిప్యూటీ మేనేజర్ నుంచి జనరల్ మేనేజర్ వరకు) ఎనిమిదేళ్ల నుంచి 17 ఏళ్ల వరకు ఒకే డిజిగ్నేషన్‌తో అదే పోస్టుల్లో ఉండిపోయారు. ఈ సమస్యపై ఉక్కు అధికారుల సంఘం యాజమాన్యంతో సంప్రతింపులు జరిపి విసిగిపోయింది. నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయింది. ప్రమోషన్ పాలసీలో మార్పులు చేసి పదోన్నతులు ఇస్తామని 2022 సెప్టెంబరులో యాజమాన్యం రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. అది కూడా అమలు చేయలేదు. ఇక లాభం లేదని ఉక్కు అధికారుల సంఘం 2024 జూన్‌లో ఏపీ హైకోర్టులో రెండు కేసులు వేసింది. పది మంది ఉద్యోగులు కలిసి అదే ఏడాది సెప్టెంబరులో మరో కేసు వేశారు. మొత్తం మూడు కేసులు పదోన్నతులపై నడుస్తున్నాయి. వాదనలు జరుగుతున్నాయి.
డబ్బులు లేవని అఫిడవిట్
ఇటీవల 45 రోజుల క్రితం అదనపు అఫిడవిట్ వేయాలని న్యాయస్థానం సూచిస్తే ప్లాంటు నష్టాల్లో ఉందని, డబ్బులు లేవని, అందుకే పదోన్నతులు ఇవ్వడం లేదని యాజమాన్యం స్పందించింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఆరు నెలలకు ఓసారి సమీక్షించుకొని బోర్డులో పాలసీ పెడతామని, అక్కడి నిర్ణయం మేరకు ముందుకు వెళతామని అఫిడవిట్ వేసింది. దీనిపై ఈ నెల రెండో తేదీన వాదనలు జరిగాయి. ఉద్యోగులకు పదోన్నతి ఇస్తే ఒక ఇంక్రిమెంట్ మాత్రమే పడుతుందని, దాని వల్ల ప్లాంటుపై అదనపు భారం కోటి రూపాయల వరకు మాత్రమే ఉంటుందని, దానికి కూడా ‘లాభాలు వస్తే..’ అని మెలిక పెట్టడాన్ని అధికారుల సంఘం అభ్యంతర వ్యక్తంచేసింది. ఇదే విషయాన్ని అధికారుల తరఫు న్యాయవాది ప్రశ్నించారు. న్యాయస్థానం కేసును ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. నష్టాలు వస్తున్నాయని సీఎండీ, డైరెక్టర్లు అలవెన్సులు తీసుకోవడం మానేస్తున్నారా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత స్థాయి పదోన్నతులు లేకపోవడం వల్ల కింది స్థాయి వారికి డెలిగేషన్ పవర్ ఇచ్చి అడ్డగోలుగా పనులు చేయిస్తున్నారు. ప్లాంటులో 15 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు ఉండగా ఒక్కరు లేరు. చీఫ్ జనరల్ మేనేజర్లు 64 మంది ఉండాలి కానీ ఒక్కరే ఉన్నారు. ఇలా ప్లాంటును నడిపితే నష్టాలు కాక మరేమి వస్తాయనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. యాజమాన్యం వితండ వాదాలు, చట్టవ్యతిరేక నిబంధనలు పక్కన పెట్టి తక్షణమే పదోన్నతులు ఇవ్వాలని అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది.