చందనోత్సవ టికెట్ల విక్రయంలో గందరగోళం
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:08 AM
వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం టికెట్ల విక్రయంలో గందరగోళం నెలకొంది.
ఆన్‌లైన్‌లో ప్రారంభం కాని అమ్మకాలు
ఆఫ్‌లైన్‌లో ప్రారంభించిన అరగంటకే అయిపోయాయంటూ సమాధానం
బ్యాంకు అధికారులతో భక్తుల వాగ్వాదం
సింహాచలం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం టికెట్ల విక్రయంలో గందరగోళం నెలకొంది. ఆన్‌లైన్‌లో 70 శాతం, ఆఫ్‌లైన్‌లో 30 శాతం టికెట్లను విక్రయిస్తామని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జల్లెపల్లి వెంకటరావుతోపాటు మంత్రులు, జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ నెల 20న ఉత్సవం జరగనున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఈనెల 12న, ఆఫ్‌లైన్ (బ్యాంకుల్లో)లో సోమవారం నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. కానీ ఆన్‌లైన్ విక్రయాలు సాంకేతిక కారణాలతో సోమవారం రాత్రి వరకూ ప్రారంభం కాలేదు. ఇక ఆఫ్‌లైన్‌లో టికెట్ల కోసం సోమవారం ఉదయం బ్యాంకులు తెరుచుకునే సమయానికే వందల సంఖ్యలో భక్తులు బారులుతీరారు. అయితే విక్రయాలు ప్రారంభించిన అరగంటలోపే తమకు దేవస్థానం నుంచి కేటాయించిన టికెట్లు అయిపోయాయని బ్యాంకుల అధికారులు చెప్పడంతో కొందరు భక్తులు వాగ్వాదానికి దిగారు. ఈ అంశంపై దేవస్థానం అధికారులను వివరణ కోరగా ఒక్కొక్క బ్యాంకుకు రూ.1,000 టికెట్లు 200, రూ.300 టికెట్లు 600 చొప్పున కేటాయించినట్టు తెలిపారు.
చందనోత్సవం టిక్కెట్ల సమాచారం
అధికారుల సమాచారం ప్రకారం రూ.1,500 టికెట్లు రెండు వేలు (దర్శన సమయం ఉదయం 3-5 గంటలు), రూ.1,000 టికెట్లు 16 వేలు, రూ.300 టికెట్లు 20 వేలు ముద్రించారు.