Share News

గజిబిజి...గందరగోళం

ABN , Publish Date - Mar 21 , 2026 | 01:09 AM

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సిగ్నళ్ల విషయంలో పోలీసులు ఒక్కో జంక్షన్‌లో ఒక్కోలా సెట్‌ చేశారు.

గజిబిజి...గందరగోళం

ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఒక్కో జంక్షన్‌లో ఒక్కోలా...

ఒకేసారి అటు...ఇటు వదిలితే ఎలా...?

తాటిచెట్లపాలెం, కారుషెడ్‌ జంక్షన్లలో వాహనచోదకుల ఇక్కట్లు

తరచూ ప్రమాదాలు

విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సిగ్నళ్ల విషయంలో పోలీసులు ఒక్కో జంక్షన్‌లో ఒక్కోలా సెట్‌ చేశారు. ఏ జంక్షన్‌లో అయినా సరే ఒక వైపు గ్రీన్‌సిగ్నల్‌ ఉంటే, మిగిలిన మూడు మార్గాల్లోను రెడ్‌ సిగ్నల్‌ ఉంటుంది. రొటేషన్‌ ప్రకారం ఒక్కో మార్గానికి గ్రీన్‌సిగ్నల్‌ వస్తుంది. కానీ జాతీయ రహదారిలో తాటిచెట్లపాలెం జంక్షన్‌ వద్ద మాత్రం వేరేగా ఉంది. ఇక్కడ సర్వీసు రోడ్డు నుంచి రైల్వేస్టేషన్‌ మార్గంలోకి వెళ్లడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినపుడు, దానికి వ్యతిరేకంగా రైల్వేస్టేషన్‌ రోడ్డు నుంచి హైవే పైకి రావడానికి, సర్వీసు రోడ్డులోకి వెళ్లడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తున్నారు. రెండు వైపులా ఒకేసారి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తోంది. దాంతో హైవేపై వాహనాలు ఒకదానికి మరొకటి అడ్డం పడుతున్నాయి. వాటిని తప్పించుకొని వెళ్లేలోపే రెడ్‌సిగ్నల్‌ పడుతోంది. దాంతో వాహనచోదకులు కంగారుపడి, ముందున్న వారిని ఢొకొట్టడం, లేదంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం వంటివి జరుగుతున్నాయి. పీఎం పాలెం కారు షెడ్‌ జంక్షన్‌ వద్ద కూడా ఇదే విధంగా అటు సర్వీసు రోడ్డు నుంచి ఇటు వచ్చేవారికి, ఇటు నుంచి అటు వెళ్లేవారికి ఒకేసారి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి వదులుతున్నారు. దీనివల్ల తీవ్రమైన గందరగోళం ఏర్పడుతోంది. ట్రాఫిక్‌ పోలీసులు దగ్గరుండి మరీ ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు వారిని వదిలిన తరువాత రెండో వైపు వారిని వదిలితే ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదు. ఇదే తాటిచెట్లపాలెం జంక్షన్‌కు కిలోమీటరు దూరంలో ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉంది. అక్కడ పెట్రల్‌ బంకు ముందు ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద మాత్రం చక్కగా సిగ్నళ్లు ఇస్తున్నారు. బాలయ్యశాస్త్రి లేఅవుట్‌ వైపు నుంచి వచ్చిన వారిని శంకరమఠం వైపు పంపి, ఆ తరువాత అటు నుంచి వచ్చిన వారిని ఇటు వైపునకు విడిచి పెడుతున్నారు. సత్యం, మద్దిలపాలెం జంక్షన్లలోను ఇలాగే చేస్తున్నారు. కానీ తాటిచెట్లపాలెం, కారు షెడ్‌ జంక్షన్ల వద్ద ఎందుకు చేస్తున్నారనేది పోలీసులే చెప్పాలి. దీనిని సరి చేయాలని వాహన చోదకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 21 , 2026 | 01:09 AM