కేజీహెచ్‌లో గందరగోళం!
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:18 AM
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో ఇటీవలి పరిణామాలపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇటీవలి పరిణామాలపై సర్వత్రా చర్చ
ఆక్సిజన్ బిల్లుల అక్రమాలపై విచారణ
కమిటీలో చేరేందుకు ఇద్దరు వైద్యుల నిరాకరణ
తాజాగా డిప్యూటీ సూపరింటెండెంట్ పదవి నుంచి తప్పుకున్న మరో వైద్యురాలు
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మెడ్కిగా న్యూరోసర్జరీ వైద్యుడికి బాధ్యతలు
ఈ నియామకంపై వెల్లువెత్తిన విమర్శలు
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో ఇటీవలి పరిణామాలపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్పత్రి ఉన్నతాధికారుల మధ్య దూరం పెరగడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పరస్పర ఫిర్యా దులతో కేజీహెచ్ ప్రతిష్ఠ మంటగలుస్తోందని వాపోతున్నారు. కొన్నాళ్ల కిందట కేజీహెచ్‌లోని ఆక్సిజన్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, భారీఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరోగ్యశాఖ రాష్ట్రస్థాయి అధికారులు స్పందించి విచారణకు కమిటీని నియమించారు. ఈ కమిటీ మూడు రోజులు విచారణ జరిపి నివేదికను అందించింది.
ఇదిలా ఉండగా ఆక్సిజన్ వ్యవహారంపై ఫిర్యాదులు రావడం, విచారణ జరగడంతో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కీలకంగా ఉన్న అధికారులకు సహకరించేందుకు వీలుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) డాక్టర్ ఎం.రాజేష్‌నాయుడు, స్కూల్ హెల్త్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.నిర్మలను నియమించారు. వీరిద్దరూ ఆయా వ్యవహారాలకు దూరం గా ఉన్నారు. డాక్టర్ నిర్మల మాత్రం తనకు అప్పగించిన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చారు. డాక్టర్ రాజేష్ నాయుడు అధికా రికంగా తప్పుకోకున్నా, అప్పగించిన బాధ్యతలకు ఉన్నారు. ఈ వ్యవహారం ఆస్పత్రిలో దుమారం రేపింది. దీనికితోడు మూడు రోజుల కిందట డిప్యూటీ సూపరిం టెండెంట్ పదవికి మరో సీనియర్ వైద్యురాలు గుడ్‌బై చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఈ బాధ్యతల్లో ఇమడలేనని ఆమె తప్పుకోవడం ఆస్పత్రిలో పరిణామాలపై మరోసారి చర్చకు దారితీసింది.
మరో వివాదాస్పద నిర్ణయం..
కేజీహెచ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మెడ్కోగా డాక్టర్ రాజేష్ పనిచేస్తున్నారు. ఆయన డిప్యూటేషన్‌పై మంగళగిరిలోని ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయానికి వెళ్లారు. ఆ స్థానంలో తాజాగా ఆస్పత్రి అధికారులు న్యూరో సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ కె.శివ రామకృష్ణ కు బాధ్యతలను అధికారులు అప్పగించారు. ఈ నిర్ణయం పైనా తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. క్లినికల్ స్పెషాలిటీ వైద్యులను ఎన్టీఆర్ వైద్య సేవ ఇన్‌చార్జి మెడ్కో గా నియమించకూడదని గతంలో డీఎంఈ నుంచి ఆదేశా లున్నాయని, ఈ తరుణంలో డాక్టర్ శివ రామకృష్ణకు బాధ్యతలు ఎలా అప్పగిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతు న్నాయి. గతంలో డాక్టర్ శివానంద్ సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన సీనియర్ వైద్యురాలికి ఎన్టీఆర్ వైద్య సేవ ఓవరాల్ ఇన్‌చార్జి బాధ్యతను అప్పగించేందుకు ప్రయత్నించగా అభ్యంతరాలు వ్యక్తమవడంతో వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో నెలకొన్న పరిణామాలపై ఉన్నతాధికా రులు దృష్టిసారించి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని పలువురు కోరుతున్నారు.
5వేల పనికిరాని ప్లాట్లు
సెంటు భూమి లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలకు అనువుగా లేవని గుర్తింపు
లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ ప్లాట్లకు ప్రతిపాదన
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):
సెంటు భూమిలో పేదలకోసం అభివృద్ధి చేసిన లేఅవుట్‌లలో సుమారు ఐదువేల ప్లాట్లు ఇళ్ల నిర్మాణాలకు అనువుగా లేవని హౌసింగ్ అఽధికారులు గుర్తించారు. ఆయా ప్లాట్లలో చాలా వరకు పునాదుతో పనులు విడిచిపెట్టాలని నిర్ణయించారు. చెరువులు ,వాగులు, కొండవాలులో వరదనీరు ప్రవహించే చోట్ల అవి ఉన్నట్టు నిర్థారించారు. వర్షాకాలం వస్తే నీరు నిలిచిపోతోందని, కొండపై నుంచి వరద నీటి ధాటికి మట్టి కొట్టుకుపోయి కాలువల్లా మారుతున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో నగర శివారుల్లో 65 లేఅవుట్‌లలో 1.4 లక్షలమందికి పట్టాలు ఇవ్వగా వారిలో సుమారు లక్షమంది మాత్రమే తీసుకోవడంతో వారికి ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు హడావిడిగా ప్రభుత్వ భూమి గుర్తించి లేఅవుట్‌ల అభివృద్ధి కోసం వీఎంఆర్‌డీఏకు అప్పగించారు. ఈ పనులు అప్పగించిన కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనిచేశారు. ఇళ్ల నిర్మాణాలకు అనువుగా ఉన్నాయా? లేవా చూడకుండా పనులు ముగించి బిల్లులు తీసుకున్నారు. ఆ తరువాత లేఅవుట్ వారీగా ప్లాట్లను లాటరీ తీసి లబ్ధిదారులకు అందజేశారు.
పెందుర్తి మండలం ముదపాకలో సుమారు నాలుగువేలమందికి వేసిన ప్లాట్లలో 500 వరకు చెరువు, కొండవాలు, వరద నీరు ప్రవహించే ప్రదేశాలే. అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కాంట్రాక్టర్లకు హౌసింగ్ అధికారులు అప్పగించారు. కొందరు కాంట్రాక్టర్లు వెనుకాముందు చూడకుండా నీరు నిల్వ ఉండే ప్లాట్లలో పునాదులకు ఉపక్రమించారు. ఆ తరువాత వర్షాలు కురవడంతో ప్లాట్లు నీటమునిగాయి. దీంతో విషయాన్ని హౌసింగ్ అధికారులకు నివేదించారు. పైడివాడఅగ్రహారం, గంగవరం, నడుపూరు, నర్సాపురం, గిడిజాల, ఇలా పలు లేవుట్‌లలో సుమారు ఐదువేల ప్లాట్లు ఇళ్ల నిర్మాణాలకు వీలుకాదని అధికారులు తేల్చారు. అప్పట్లో రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ అధికారుల నిర్లక్ష్యంతో ప్లాట్లు పొందిన లబ్ధిదారులు సమస్యను హౌసింగ్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇలా ఇళ్ల నిర్మాణాలకు వీలుకాని ప్లాట్లకు బదులు పలు కాలనీల్లో ఇంకా మిగిలిన ప్లాట్లను వారికి కేటాయించాలనే ప్రతిపాదన ఉంది. త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని హౌసింగ్ అధికారులు తెలిపారు.