పేరు మార్చి... ఏమార్చి!
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:49 AM
నగరంలో గూడులేని పేదల కోసం సెంటు స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్ల వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతోంది.
రాక్‌ట్రీ వదిలేసిన 15 వేల ఇళ్ల పూర్తికి బెంగళూరు కంపెనీల ఆసక్తి
గతంలో మధ్యలోనే పనులు నిలిపివేసిన సంస్థలే మరో పేరుతో ప్రయత్నాలు
ఉన్నత స్థాయి పలుకుబడితో పైరవీలు
అధికారులపై కూటమి నేత, ఓ మంత్రి ఓఎస్‌డీ ఒత్తిడి
తలలు పట్టుకుంటున్న హౌసింగ్ శాఖ
విశాఖపట్నం/సబ్బవరం/గాజువాక, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి):
నగరంలో గూడులేని పేదల కోసం సెంటు స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్ల వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతోంది. అనంతపురం జిల్లా వైసీపీ నేతకు చెందిన రాక్‌ట్రీ ఏజెన్సీస్ మధ్యలోనే వదిలేసిన 15వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతను చేపట్టేందుకు బెంగళూరుకు చెందిన కంపెనీలు పైరవీ చేస్తున్నాయి. ఈ పనులు అప్పగించాలని కీలకమంత్రి ఓఎస్‌డీ, కొందరు కూటమినేతలు హౌసింగ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
నగర శివారు పైడివాడ అగ్రహారం, నంగినారపాడు, గంగవరం, నడుపూరు లేఅవుట్‌లలో 15 వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతలను అనంతపురం జిల్లా వైసీపీ నేతకు చెందిన రాక్‌ట్రీకు అప్పగించారు. ఈ సంస్థ నిర్మాణాలు పూర్తిచేయలేకపోయింది. అంతేకాకుండా పలు అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్ నిర్ధారించింది. ఎలా అయినా వీటిని పూర్తిచేయాలని హౌసింగ్ అధికారులకు గత కలెక్టర్ ఆదేశించారు. దీంతో నాలుగైదు కంపెనీలను గుర్తించి 8వేల ఇళ్లను అప్పగించి, మ్యాపింగ్ చేశారు. ఈలోగా బెంగళూరుకు చెందిన ఇన్‌ఫ్రా కంపెనీలుపైరవీలు ప్రారంభించాయి. కీలకమంత్రి పేషీలో పనిచేసే ఓఎస్‌డీ, మరో కూటమి నేత 15 వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతలను బెంగళూరు కంపెనీకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సదరు ఓఎస్‌డీ హౌసింగ్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తేవడంతోపాటు బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కంపెనీల వివరాలపై హౌసింగ్ అఽధికారులు విచారణ చేయగా పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
రంగంలోకి అవే కంపెనీలు
గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణ బాధ్యతలను అనేక కంపెనీలు తీసుకున్నాయి. రాష్ట్రంలో సుమారు 30 వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతలు తీసుకున్న కంపెనీలు 30 శాతం కూడా పనులు చేయలేకపోయాయి. నగర శివారు నంగినారపాడులో నిర్మాణాలకు ముందుకు వచ్చిన కంపెనీ పునాదులతో నిలిపివేసింది. మరో రెండుమూడు కంపెనీలు చేతులెత్తేశాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఎండీ ఆదేశించినా కనీసం షోకాజ్ కూడా ఇవ్వలేదు. కాగా ప్రస్తుతం అవే కంపెనీలు కొత్త పేర్లతో తెరపైకి వచ్చి కీలకమంత్రి ఓఎస్డీ, కూటమినేత ద్వారా పైరవీలు సాగిస్తున్నాయి. వాటికి అప్పగిస్తే, రాక్‌ట్రీలా మధ్యలో వదిలేస్తే పరిస్థితి ఏమిటని అధికారులు తలలు పట్టుకున్నారు. అయినా పైనుంచి వస్తున్న ఒత్తిడితో నిర్మాణ బాధ్యతలను బెంగళూరు కంపెనీలకే అప్పగించేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.