అభివృద్ధికి అనుగుణంగా సీఆర్‌జడ్‌లో మార్పులు
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:28 AM
అభివృద్ధి, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ పర్యావరణహితంగా మధురవాడ సరిహద్దు నుంచి భీమునిపట్నం వరకు గల తీరప్రాంతాన్ని సీఆర్‌జడ్-3 నుంచి సీఆర్‌జడ్-2గా పునర్ వర్గీకరించాలని పలువర్గాలు, సంస్థల ప్రతినిధులు, తీర ప్రాంత ప్రజలు కోరారు.
కేటగిరీ 3 నుంచి 2లోకి పునర్ వర్గీకరించాలని పలు సంస్థల ప్రతినిధులు, వర్గాల విజ్ఞప్తి
మనుగడకు ఇబ్బంది లేకుంటే స్వాగతిస్తామన్న మత్స్యకారులు
వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో సీఆర్‌జడ్ 2019 ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ
అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యత ఉండాలి: కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం/సిరిపురం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
అభివృద్ధి, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ పర్యావరణహితంగా మధురవాడ సరిహద్దు నుంచి భీమునిపట్నం వరకు గల తీరప్రాంతాన్ని సీఆర్‌జడ్-3 నుంచి సీఆర్‌జడ్-2గా పునర్ వర్గీకరించాలని పలువర్గాలు, సంస్థల ప్రతినిధులు, తీర ప్రాంత ప్రజలు కోరారు. మనుగడకు ఇబ్బంది లేకుంటే మార్పును స్వాగతిస్తామని మత్స్యకార నాయకులు స్పష్టంచేశారు.
వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధ్యక్షతన సీఆర్‌జడ్ మార్పుపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. వ్యాపార, హోటళ్లు, రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రతినిధులు, పలు గ్రామాల ప్రజలు, మత్స్యకార సంఘాలు, సామాజిక కార్యకర్తల నుంచి సుమారు 20 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. తొలుత ప్రజాభిప్రాయ సేకరణ ఉద్దేశాన్ని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పీవీ ముకుందరావు వివరించారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ రూపొందించిన కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ 2019 అమలుకు సంబంధించి మ్యాపుల రూపకల్పన, భూముల వినియోగంపై ప్రజాభిప్రాయ సేకరణకు సమావేశం ఏర్పాటుచేశామన్నారు. ఈ సందర్భంగా చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్‌మేంట్ అథారిటీ సైంటిస్టు మహాపాత్రా, ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఈఈ షేక్ సుభాన్ 2011, 2019 నోటిఫికేషన్ల మధ్య వ్యత్యాసాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అనంతరం హోటళ్లు, రిసార్టులకు చెందిన ప్రతినిధులు పవన్ కార్తీక్, శ్రీనివాస్, రమణ, తదితరులు మాట్లాడుతూ విశాఖపట్నంలో రుషికొండ వరకు మాత్రమే అభివృద్ధి జరిగిందని, భీమునిపట్నం వరకు ప్రాజెక్టులు ఏర్పాటుచేయడానికి ప్రస్తుతం సీఆర్‌జడ్-3లో ఉన్న ప్రాంతాన్ని సీఆర్‌జడ్-2లోకి మార్చాలని కోరారు. భీమిలి రోడ్డుకు తూర్పున ప్రభుత్వ శాఖలతోపాటు మత్స్యకార గ్రామాల్లో మాత్రమే నిర్మాణాలను అనుమతిస్తున్నారన్నారు. రాడిసిన్ బ్లూ హోటల్ నిర్మాణానికి అనుమతించినట్టుగానే తమ ప్రాజెక్టులు కూడా ఆమోదించాలని కోరారు. కనీసం తాత్కాలిక నిర్మాణాలను అనుమతిస్తే పర్యాటకం పెరిగి పలువురికి ఉపాధి లభిస్తుందన్నారు. సీఆర్‌జడ్-3లో ఉన్న భీమునిపట్నం హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రాంతం, నేరేళ్లవలస పరిసర గ్రామాలను సీఆర్‌జడ్-2లోకి మార్చాలన్నారు. మత్స్యకారుల జీవనోపాధి, పర్యావరణం, మనుగడకు ఇబ్బంది లేకుండా మార్పులు చేయాలని ఆ సంఘాల నేతలు తెడ్డు శంకర్, తదితరులు కోరారు. సీఆర్‌జడ్ నిబంధనల మేరకు మౌలిక వసతులు ఉంటేనే మార్పు చేయాలని, చేపలుప్పాడ నుంచి భీమిలి వరకు పలు గ్రామాల్లో అటువంటి పరిస్థితి లేదన్నారు.
అనంతరం కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి సంస్థలు రూపొందించిన మ్యాపులను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటివరకు లిఖితపూర్వకంగా 50 వినతులు, అభ్యంతరాలు వచ్చాయని, వాటిని వీడియో రూపంలో, రాతపూర్వకంగా డాక్యుమెంట్ చేసి రాష్ట్రస్థాయి అథారిటీకి పంపిస్తామన్నారు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారని, ఆ తరువాత సీఆర్‌జడ్-3పై నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందన్నారు. తీర ప్రాంత పర్యావరణ కార్యక్రమాలకు అనుకూలత కల్పించడంతో పాటు అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యత అవసరమన్నారు. కార్యక్రమంలో ఏపీపీసీబీ సీఈ రాజశేఖర్, విశాఖ జోనల్ కార్యాలయం జాయింట్ చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.