మోదకొండమ్మ ఉత్సవాల తేదీల మార్పు
ABN , Publish Date - Apr 16 , 2026 | 01:36 AM
మే నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన స్థానిక మోదకొండమ్మ ఉత్సవాల తేదీలను మార్పు చేశారు. మే 17, 18, 19 తేదీల్లో ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో కలెక్టర్ టి.నిశాంతి ప్రకటించారు.
మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమక్షంలో ప్రకటించిన కలెక్టర్ టి.నిశాంతి
పాడేరు, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): మే నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన స్థానిక మోదకొండమ్మ ఉత్సవాల తేదీలను మార్పు చేశారు. మే 17, 18, 19 తేదీల్లో ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో కలెక్టర్ టి.నిశాంతి ప్రకటించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ టి.నిశాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ఉత్సవాల సమన్వయ సమావేశంలో కాసేపు చర్చించిన అనంతరం ఉత్సవాల తేదీలను మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చెందిన పోలీసు బలగాలు ఆయా రాష్ట్రాలకు తరలివెళ్లాయని, ఈ క్రమంలో మే 10, 11, 12 తేదీల్లో ఉత్సవాలకు బందోబస్తు నిర్వహించలేమని ఎస్‌పీ అమిత్‌బర్దార్ తెలిపారు. దీంతో మోదకొండమ్మ ఆలయం ప్రధానార్చకుడు సుబ్రహ్మణ్యంను రప్పించి ఉత్సవాల నిర్వహణకు అనువైన తేదీలను తెలపాలని సూచించారు. దీంతో మే 17, 18, 19 తేదీల్లో ఉత్సవాల నిర్వహణకు అనువుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తేదీలపై అందరి అభిప్రాయం తెలియజేసి ఆమోదం తెలపాలని మంత్రి సంధ్యారాణి కోరారు. అందుకు స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అభ్యంతరం తెలిపారు. తాము నిర్ణయించిన తేదీలను మార్చేసి వేరే తేదీలను సూచించడం సరికాదన్నారు. దీనిపై స్పందించిన మంత్రి సంధ్యారాణి తేదీలను మీకు నచ్చినట్లు ప్రకటిస్తే ఎలా? అని, మోదకొండమ్మ ఉత్సవాలు ప్రభుత్వ పండుగ అని, అందరి సమన్వయంతో తేదీలను ప్రకటించాలన్నారు. ఉత్సవాలకు ఏర్పాట్లు, భద్రత కల్పించే అధికారుల అభిప్రాయాలకు అనుగుణంగా అందరికి ఆమోదయోగ్యమైన తేదీల్లో ఉత్సవాలను నిర్వహించాలని మంత్రి పేర్కొని, తేదీలను ప్రకటించాలని కలెక్టర్‌కు సూచించారు. దీంతో మే నెల 17, 18 19 తేదీల్లో మోదకొండమ్మ ఉత్సవాలు జరుగుతాయని, అధికారులు, ఆలయ, ఉత్సవ కమిటీ సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తామని కలెక్టర్ నిశాంతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, డీఆర్‌వో నీలకంఠరావు, ఆర్‌డీవో లోకేశ్వరరావు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, వివిధ శాఖల అధికారులు, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.