వివాదాల్లో చంద్రంపాలెం హైస్కూల్
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:38 AM
రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులు ఉన్న చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి.
సెలవులో హెచ్‌ఎం
ఉపాధ్యాయుల ఫిర్యాదుతో డిప్యూటీ డీఈవో విచారణ
పాఠశాల ప్రక్షాళనపై ఎమ్మెల్యే దృష్టి
విశాఖపట్నం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులు ఉన్న చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. పాఠశాల హెచ్‌ఎం ఎం.వెంకటరావుపై గత వారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయడంతో విచారణకు జిల్లా డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావును నియమించారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎం వెంకటరావు రెండు రోజుల క్రితం మెడికల్ లీవ్‌లో వెళ్లిపోయారు. ప్రస్తుతం సీనియర్ స్కూలు అసిస్టెంట్ ఒకరికి హెచ్‌ఎం బాధ్యతలు అప్పగించారు. హెచ్‌ఎం మెడికల్ లీవ్‌లోకి వెళ్లకు ముందు పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు విజయభాస్కర్‌ను కలిసి వివరణ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య మూడు వేల కంటే తక్కువకు పడిపోయిందని, ఇందుకు తాను ఒక్కడినే కారణం కాదని ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. ప్రస్తుతం పాఠశాలలో సుమారు 100 ఉపాధ్యాయులు ఉన్నారని, వారిలో కొద్దిమంది తప్ప మిగిలినవారు బాగా పనిచేస్తున్నారని, ఈ ఏడాది వేసవి సెలవులకు ముందు నుంచి పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను కలిశారని ఆర్జేడీకి హెచ్‌ఎం నివేదించారని చెబుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల పేరుతో ఇద్దరు, ముగ్గురు మాత్రం ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాగా స్థానికులు ముఖ్యంగా కూటమి నేతలు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసి చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. హెచ్‌ఎం, కొందరు టీచర్ల మధ్య నిరంతరం వివాదాలు తలెత్తుతుండడంతో పిల్లలను చేర్పించడానికి పలువురు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారని చెప్పారు. పాఠశాలను ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ విజయభాస్కర్, డీఈవో ప్రేమకుమార్‌లను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలిపించారు. అయితే డీఈవో రెండు రోజుల సెలవులో ఉండడంతో గంటాతో సమావేశం వాయిదా పడింది. కాగా హెచ్‌ఎంపై విచారణాధికారిగా నియమితులైన డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు ఇప్పటికే ఒక పర్యాయం పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. సెలవు నుంచి హెచ్‌ఎం తిరిగి వచ్చిన తరువాత మరోసారి విచారణకు పాఠశాలకు వెళ్లనున్నట్టు డిప్యూటీ డీఈవో తెలిపారు.
బెంగళూరు ప్రత్యేక రైలు మరో ఐదు ట్రిప్పులు
విశాఖపట్నం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి):
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖ-బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను మరో ఐదు ట్రిప్పులు కొనసాగిస్తున్నామని దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్‌వో వై.బాలాజీ కిరణ్ తెలిపారు. విశాఖ-బెంగళూరు ప్రత్యేక రైలు (08581) జూలై 31 వరకు (ప్రతి ఆదివారం), తిరుగు ప్రయాణంలో బెంగళూరు-విశాఖ ప్రత్యేక రైలు (08582) జూలై 4 నుంచి ఆగస్టు ఒకటి వరకు (ప్రతి సోమవారం) అందుబాటులో ఉంటాయని తెలిపారు.
టెకీ రాధాగాయత్రిది ప్రీప్లాన్డ్ మర్డర్
శ్రీచరణ్‌ను నడిరోడ్డుపై ఉరితీయాలి
మృతురాలి తల్లిదండ్రుల డిమాండ్
సింహాచలం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి):
తమ కుమార్తెను అంతమొందించేందుకే శ్రీచరణ్ పక్కా ప్రణాళికతో ముస్సోరీ తీసుకువెళ్లాడని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధాగాయత్రి తల్లిదండ్రులు సత్యవతి, సుధాకర్ ఆరోపించారు. శ్రాద్ధకర్మల్లో పాల్గొనేందుకు శుక్రవారం సింహాచలం వచ్చిన వారు మీడియాతో మాట్లాడుతూ...తమ కుమార్తె మరణానికి శ్రీచరణ్ ప్రధాన కారకుడని, ముస్సోరీ తీసుకువెళ్లడం వెనుక మర్డర్ ప్లాన్ ఉందన్నారు. మీడియాను, పోలీసులను శ్రీచరణ్ తప్పుదోవ పట్టించాడన్నారు. భార్యమీద, అత్తమామలపై ప్రేమ ఉంటే కర్మకాండలకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, విశాఖలోనే తిరుగుతున్నాడన్నారు. ముస్సోరీకి వెళుతున్నట్టు మీడియాకు చెప్పినప్పటికీ, నేటివరకూ వెళ్లలేదని, పోలీసుల కన్ను గప్పి నగరంలోనే ఉన్నాడన్నారు. రాధాగాయత్రి మృతికి కారకుడైన శ్రీచరణ్‌ను బహిరంగంగా, ప్రజల సమక్షంలో ఉరి తీయాలని, అదే అతడికి సరైన శిక్ష అన్నారు. అంతకుముందు చినముషిడివాడలోని తమ ఇంట్లో రాధాగాయత్రి ఫొటో వద్ద పూజలు చేశారు. ఈ సమయంలో ఆమె తల్లి సత్యవతి కన్నీమున్నీరుగా విలపించారు.
జగన్‌కు కాపులు ఇప్పుడు గుర్తుకువచ్చారా?
నాడు చంద్రబాబునాయుడు రిజర్వేషన్లు ప్రకటిస్తే, అధికారంలోకి వచ్చిన తరువాత నిలిపివేసిన విషయం గుర్తులేదా?
ఎమ్మెల్సీ సోము వీర్రాజు
అక్కయ్యపాలెం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి):
వైసీపీ హయాంలో విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పనిచేసిన కాపు సామాజిక వర్గానికి చెందిన కురసాల కన్నబాబుపై అప్పటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పెత్తనం చెలాయించేవారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. నగరానికి వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక నిలిపివేసిన విషయం గుర్తులేదా?...అని ప్రశ్నించారు. కాపులపై అప్పుడు లేని ప్రేమ జగన్‌కు ఇప్పుడు కొత్తగా పుట్టుకువచ్చిందా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరోలో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలున్నారని, రాష్ట్రంలో నిజంగా కాపులకు ఇబ్బందులు ఎదురైతే అండగా నిలిచేందుకు కూటమిలో ఎంతోమంది కాపు నాయకులు ఉన్నారన్నారు. వైసీపీ హయాంలో సమన్వయకర్తలుగా పనిచేసిన వారంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారేనని గుర్తుచేశారు. కాపుల పేరుతో రాజకీయం చేస్తుండడంపై వీర్రాజు తీవ్రంగా మండిపడ్డారు.
నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం
విశాఖపట్నం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి):
జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరగనున్నదని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని కోరారు. పార్లమెంటు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు హాజరుకావాలని కోరారు.