పకడ్బందీగా చందనోత్సవం
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:44 AM
సింహాచలం వరాహలక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.
పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు
ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయానికి ప్రాధాన్యం
వీవీఐపీలకు ఉదయం 5 గంటల వరకే నిజరూప దర్శనం
మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
ఉత్సవ ప్రత్యేక అధికారిగా కలెక్టర్, ఇన్‌చార్జిగా దేవదాయ శాఖ కమిషనర్
ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయానికి పోర్టల్ ప్రారంభం
విశాఖపట్నం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహలక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఈనెల 20న నిర్వహించే చందనోత్సవం నిర్వహణపై కలెక్టరేట్‌లో శనివారం మంత్రుల కమిటీ, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. అనంతరం ఆ వివరాలను మంత్రులు ప్రత్యేకంగా విలేకరులకు వివరించారు.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌పీఓ) ప్రకారమే అప్పన్న చందనోత్సవం నిర్వహిస్తామన్నారు. అన్నిరకాల దర్శనాలకు టికెట్లను స్లాట్ విధానంలో జారీచేస్తామన్నారు. భక్తులు వారికి నిర్దేశించిన సమయంలోనే దర్శనాలకు రావాలన్నారు. ఆరోజు ఉదయం 5 గంటల వరకు వీవీఐపీలకు స్వామి నిజరూపం దర్శనం ఉంటుందని, ఆ తరువాత అనుమతించరని స్పష్టంచేశారు. ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సబ్ కమిటీ ఉత్సవ ఏర్పాట్లను సమీక్షిస్తుందన్నారు. టికెట్లు, వాహనాలకు ఇచ్చే పాసులపై క్యుఆర్ కోడ్ ఉంటుందన్నారు. పార్కింగ్ సులభతరం చేస్తున్నామన్నారు. ప్రొటోకాల్, వీఐపీ టికెట్లు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జారీచేస్తామన్నారు. టికెట్లలో 70 నుంచి 80శాతం ఆన్‌లైన్‌లో విక్రయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారన్నారు. ఉత్సవానికి కలెక్టర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారని, ఇన్‌చార్జి స్పెషలాఫీసర్‌గా దేవదాయ శాఖ కమిషనర్‌ను నియమించామన్నారు. ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేసి, ఒక్కో క్యూలైన్‌లో 21 వేల మంది భక్తులు దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈసారి ప్రత్యేకంగా హోల్డింగ్ ఏరియాల ద్వారా రద్దీ నియంత్రిస్తామన్నారు.
ఆన్‌లైన్ పోర్టల్‌లో టికెట్ల విక్రయం
ఉత్సవం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి పోర్టల్ ఏర్పాటుచేసిన అధికారులు శనివారం దానిని మంత్రులు ఆనం, డోలాలతో ప్రారంభింపజేశారు. మొదటి టికెట్‌ను దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనుగోలు చేశారు. సోమవారం నుంచి పోర్టల్ అందుబాటులోకి వస్తుందని, ఏపీటీఎస్ సాయంతో దీనిని రూపొందించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశాల్లో హోం మంత్రి అనిత, ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేశ్‌బాబు, విష్ణుకుమార్‌రాజు పలు సూచనలిచ్చారు. దేవదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ హరిజవహర్‌లాల్, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, సీపీ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీసీపీలు మణికంఠ, మేరీ ప్రశాంతి, దేవస్థానం ఈఓ వెంకటరావు, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి టికెట్ల విక్రయాలు
సింహాచలం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి):
అప్పన్న నిజరూప దర్శన టికెట్లను ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లెపల్లి వెంకటరావు ప్రకటించారు. ఈ మేరకు ఈనెల 12నుంచి 17 మధ్య దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లో రూ.300, రూ.1000 టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 70 శాతం టికెట్లను ఆన్‌లైన్‌లో, మిగిలిన వాటిని ఆఫ్‌లైన్‌లో యూనియన్ బ్యాం కు సింహాచలం, అక్కయ్యపాలెం, స్టేట్ బ్యాంకు సింహాచలం, బిర్లా జంక్షన్ శాఖల్లో ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విక్రయిస్తారన్నారు.