చకచకా పాలగెడ్డ-ఆర్‌వీనగర్ రోడ్డు పనులు
ABN , Publish Date - May 17 , 2026 | 10:16 PM
అంతర్ రాష్ట్ర పాలగెడ్డ-ఆర్‌వీనగర్ రహదారి నిర్మాణాలు ఊపందుకున్నాయి.
ఆర్‌వీనగర్ నుంచి నూతిబంద వరకు
వేసిన మొదటి లేయర్ తారు
రెండు నెలల్లో పనులు పూర్తి
సంబరపడుతున్న గిరిజనులు
గూడెంకొత్తవీధి, మే 17 (ఆంధ్రజ్యోతి): అంతర్ రాష్ట్ర పాలగెడ్డ-ఆర్‌వీనగర్ రహదారి నిర్మాణాలు ఊపందుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పాలగెడ్డ-ఆర్‌వీనగర్ రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. దీంతో ఈ మార్గంపై ప్రయాణించే ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులు సర్కస్ ఫీట్లు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోడ్డుపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి పాలగెడ్డ-ఆర్‌వీనగర్ రహదారి 43.6 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.18.65 కోట్లను విడుదల చేశారు. ఈ రహదారి నిర్మాణాలను ఫిబ్రవరిలో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రారంభించారు. వర్షాల కారణంగా తొలుత పనుల్లో కొంత జాప్యం జరిగినా ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆర్‌వీనగర్ నుంచి నూతిబంద వరకు మొదటి లేయర్ తారు రోడ్డును వేశారు. ఇతర ప్రాంతాల్లోను పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రెండు నెలల్లో రెండో లేయర్ పనులు పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ ఏఈఈ బి.జయరాజ్ తెలిపారు. తారు రోడ్డు అందుబాటులోకి వస్తుండడంతో ప్రాంతీయ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.