మెరుగైన విద్యనందించేందుకే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:22 PM
గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకే విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేశామని, ప్రభుత్వానికి పిల్లల భవిష్యత్తు ముఖ్యమని, వారిని ఎవరూ ప్రభావితం చేయకూడదని గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీ ఎంఎం నాయక్ తెలిపారు.
పిల్లల భవిష్యత్తు ముఖ్యం, వారిని ఎవరూ ప్రభావితం చేయకూడదు
గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీ ఎంఎం నాయక్
విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకే విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేశామని, ప్రభుత్వానికి పిల్లల భవిష్యత్తు ముఖ్యమని, వారిని ఎవరూ ప్రభావితం చేయకూడదని గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీ ఎంఎం నాయక్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రుల అభిప్రాయాలను గౌరవించి, వారి కోరిక ప్రకారం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. గత రెండేళ్లుగా సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందన్నారు. గతేడాది రూ.143 కోట్లు వెచ్చించి హాస్టళ్ల మరమ్మతులను పూర్తి చేశామన్నారు. విద్యార్థులకు వ్యాధులు రాకుండా, శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్లు, ఇతర ప్రాథమిక మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. విద్యా విధానంలోనూ అనేక మార్పులు తీసుకువచ్చామని, చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం మైల్, ఎఫ్‌ఎల్‌ఎన్ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్ ప్రవేశ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో ఎస్సీలకు (తాడికొండ, మేఘాద్రిగెడ్డ, కోట), ఎస్టీలకు మారికవలస, బీసీలకు మరో రెండు కేటాయించినట్టు తెలిపారు. విశాఖ విద్యా కేంద్రంగా ఉండడం వల్ల మారికవలస బాలుర రెసిడెన్సియల్ భవనం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు అనుకూలంగా ఉందని ఎంపిక చేసినట్టు చెప్పారు. బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ప్రముఖ విద్యా సంస్థ ఫిజిక్స్ వాలాను ఎంపిక చేశామని, ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెరో 150 సీట్లు చొప్పున 300 మందికి ఎంపీసీ, మరో 300 మందికి బైపీసీ కలిపి 600 మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నట్టు వెల్లడించారు. పదో తరగతి మార్కుల ఆధారంగా గురుకులం సెక్రటరీ పర్యవేక్షణలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయనున్నట్టు వెల్లడించారు. కో-ఎడ్యుకేషన్ పద్ధతిలో బోధన, ఆన్‌లైన్ పరీక్షలు ఉంటాయన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా మారికవలసలోని పాఠశాల విద్యార్థులను తల్లిదండ్రుల సమ్మతితో సమీపంలోని శ్రీకృష్ణాపురం, మారకవలస గర్ల్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసినట్టు చెప్పారు. మాడుగుల ప్రాంతానికి 39 మంది విద్యార్థులను వారి కోరిక మేరకు పంపించామని, ఈ నెల 26న పాడేరు వద్ద కొందరు బస్సులు ఆపి ధర్నా చేయడంతో విద్యార్థులు కోరిన విధంగా తిరిగి మారికవలసలోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఏకలవ్య, ఆశ్రమ పాఠశాలల్లో ఇప్పటికే కో-ఎడ్యుకేషన్ అమలులో ఉందని, విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తు మాత్రమే ప్రభుత్వానికి ప్రాధాన్యమన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల కార్యదర్శి గౌతమి, విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పాల్గొన్నారు.