వ్యర్థాల నిర్వహణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:16 AM
చెత్త నుంచి సంపద సృష్టించడమే ధ్యేయంగా విజయవాడలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుచేస్తున్నామని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రకటించారు.
పట్టణ ప్రాంతాల్లో 107, మండలాల్లో 220 వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు
రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):
చెత్త నుంచి సంపద సృష్టించడమే ధ్యేయంగా విజయవాడలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుచేస్తున్నామని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రకటించారు. ఈ విషయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, సీఐఐ కలిసి పనిచేస్తాయన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, సీఐఐ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని గాదిరాజు ప్యాలెస్‌లో ‘సర్క్యులర్ ఎకానమీ-గ్రీన్ కంపెనీస్’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో పట్టాభి మాట్లాడుతూ సమాజానికి సవాల్‌గా మారుతున్న వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికి గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సర్క్యులర్ ఎకానమీ మార్గదర్శకాలు ఇటీవల విడుదలయ్యాయన్నారు. సుస్థిర అభివృద్ధి సాధించడమే సర్క్యులర్ ఎకానమీ లక్ష్యమన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని, వ్యర్థాల నిర్వహణ ద్వారా సంపద సృష్టించేందుకు అవసరమైన పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు తీసుకువస్తామన్నారు. సర్క్యులర్ ఎకానమీ విలువ 2050కల్లా రెండు ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని, పది మిలియన్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పేరుకుపోయిన లక్ష టన్నుల వ్యర్థాల నిర్వహణకు బయో మైనింగ్ చేస్తున్నామన్నారు. ఇందుకు పట్టణ, నగరాల్లో 107 వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మ్రూడు మండలాలకు ఒకటి చొప్పున 220 ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.450 కోట్ల వరకూ వెచ్చించనున్నాయన్నారు. భవిష్యత్తులో ఎక్కడా డంపింగ్ యార్డు కనిపించకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వ్యర్థాల నిర్వహణ ద్వారా తడి చెత్త ప్రాసెస్ చేసి ఏటా ఐదారు లక్షల టన్నుల ఎరువు ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో రోజుకు 1,300 టన్నుల నుంచి 1,400 టన్నుల కోడి వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, వాటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి విలువైన ఉత్పత్తులు తయారుచేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా పొడి చెత్తనుపది రకాలుగా వర్గీకరించి, రీసైక్లింగ్ పరిశ్రమలకు సరఫరా చేస్తామన్నారు. రీసైక్లింగ్ పరిశ్రమలకు ముడిపదార్థాలు కొరత లేకుండా చేయడమే లక్ష్యంగా త్వరలో రియల్ టైమ్ డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. దీని ద్వారా ఏ ప్రాంతంలో ఎంత పరిమాణంలో ప్లాస్టింగ్, ఇతర రీసైక్లింగ్ ముడి పదార్థాలు అందుబాటులో ఉన్నాయో ఆయా పరిశ్రమలు తెలుసుకోవచ్చునని పట్టాభిరామ్ పేర్కొన్నారు.