శతాబ్ది వేళ అభివృద్ధి మేళా
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:58 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ అధికారులు సుమారు రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
రూ.700 కోట్లతో ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల ప్రణాళికలు
జాబితాలో కీలక విభాగాల ఆధునికీకరణ, పునర్నిర్మాణం, రీసెర్చ్ సెంటర్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్, మెగా మెస్, హాస్టళ్ల నిర్మాణం
లైబ్రరీ విస్తరణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు
దాతల సహకారంతో మరికొన్ని ప్రాజెక్టులు
విశాఖపట్నం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ అధికారులు సుమారు రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో రూ.500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మరో రూ.200 కోట్లు కేంద్రం నుంచి పొందేందుకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపించారు. వందేళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఈ క్రమంలోనే హెరిటేజ్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ కింద యూజీసీ ద్వారా రూ.200 కోట్లు ఇవ్వాలని వర్సిటీ అధికారులు కోరారు. ఆ నిధులతో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలతో ప్రతిపాదనలు విద్యా శాఖకు అందించగా, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నేరుగా కేంద్రానికి పంపించి, సహకరించాలని కోరినట్టు వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
రూ.500 కోట్లతో కీలక ప్రాజెక్టులు
వందేళ్లు జరుపుకుంటున్న వర్సిటీకి రూ.500 కోట్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు కోరారు. ఆ నిధులతో మెగా మెస్, హాస్టళ్లు, అకాడమిక్ కాన్ఫరెన్స్ హాల్, సాగరిక హాల్‌పై అదనంగా మరో మూడు అంతస్థులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే, రెండు గేట్లు ఆధునికీకరణ, రంజనీ గెస్ట్ హౌస్ రెన్నోవేషన్, వీసీ బంగ్లా ఆధునికీకరణ, కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఫిజిక్స్ విభాగం బిల్డింగ్ వద్ద సెంటినరీ పార్కు నిర్మాణం, అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. ఇంకా సైకాలజీ విభాగం ఎదరుగా నిర్మించిన ఎలిమెంట్ బిల్డింగ్‌లో ఏర్పాటుచేసిన బయో ఫార్మా బయోటెక్ ల్యాబ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు అనుగుణంగా సదుపాయాల కల్పన, పరికరాల కొనుగోలు, క్వాంటం టెక్నాలజీ కోర్సులకు అనుగుణంగా ల్యాబ్ ఏర్పాటు (రూ.50 కోట్లు), సెమీ కండక్టర్స్ ల్యాబ్ ఏర్పాటుకు కొందరు దాతలు ముందుకు వచ్చారు. అలాగే, ఆర్ట్స్, లా, కామర్స్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కాంపిటెన్సీ డెవలప్‌మెంట్ సెంటర్ (రూ.5 కోట్లు) ఏర్పాటు, ల్యాబ్‌లలో అత్యాధునిక పరికరాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు కోసం రూ.100 కోట్లు అవుతాయని అంచనాలు రూపొందించారు. సెంటినరీ సెలబ్రేషన్ కోసం రూ.25 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.
కేంద్ర నిధులకు..
కేంద్ర ప్రభుత్వ నిధులతో వేయి మంది విద్యార్థులకు సర తినేలా మెస్, ఒక గర్ల్స్ హాస్టల్, రెండు బాయ్స్ హాస్టల్స్, వర్సిటీలోని కీలక విభాగాలకు చెందిన భవనాల ఆధునికీకరణ, పునర్నిర్మాణం (తొమ్మిది భవనాలను గుర్తించారు), రీసెర్చ్ సెంటర్, కేఫ్‌టేరియా, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (డిస్కషన్ రూమ్స్, సెమినార్ హాల్స్), లైబ్రరీ విస్తరణ, ఆధునికీకరణ, ఆన్‌లైన్ లెక్చర్ రికార్డింగ్ స్టూడియో వంటివి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
రూ.100 కోట్లతో పనులు ప్రారంభించే యోచన
- ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, ఏయూ వైస్ చాన్సలర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహకారానికి ప్రతిపాదనలు పెట్టాం. ఈలోగా సుమారు రూ.100 కోట్లతో కీలకమైన ప్రాజెక్టులను ప్రారంభించాలని భావిస్తున్నాం. ఆయా పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఈసీ ముందు పెట్టి ముందుకు వెళతాం. వర్సిటీ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకారాన్ని తీసుకుంటున్నాం. విభాగాల్లో కీలక ప్రాజెక్టులు ఏర్పాటుకు నిధులు అందించడానికి ఇప్పటికే ఎంతోమంది ముందుకువచ్చారు. మరో వందేళ్లపాటు సగర్వంగా సేవలు అందించేలా కీలక ప్రాజెక్టులు చేపట్టి, అంతర్జాతీయ స్థాయిలో వర్సిటీని నిలబెట్టేందుకు కృషిచేస్తున్నాం. సీఎస్‌ఆర్ యాక్టివిటీలో భాగంగా అనేక సంస్థలు వర్సిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు సహకారాన్ని అందించేందుకు ముందుకువస్తున్నాయి. ఒకవైపు పూర్వ విద్యార్థులు, మరోవైపు కార్పొరేట్ సంస్థలు, ఇంకోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వర్సిటీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు కృషిచేస్తున్నాం.