ఏయూ ఖ్యాతి ఇనుమడించేలా శతాబ్ది సంబరాలు
ABN , Publish Date - Apr 07 , 2026 | 01:04 AM
‘‘ఆంధ్ర విశ్వవిద్యాలయం ఖ్యాతి ఇనుమడించేలా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. గడిచిన ఏడాదికాలంగా విభిన్నమైన కార్యక్రమాలతో ఎంతోమంది ప్రముఖులను వేడుకల్లో భాగస్వామ్యులను చేశాం.
పూర్వ విద్యార్థుల సంఘం, ప్రముఖ పూర్వ విద్యార్థులను అనుసంధానం చేస్తూ కార్యక్రమాలు
గత ఏడాది ఏప్రిల్ నుంచి నిర్వహణ
ఈ నెల 18 నుంచి 26 వరకూ ఉత్సవాలు
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలకు ఆహ్వానం
26న ముఖ్యమంత్రి, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి హాజరు
మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.700 కోట్లతో ప్రతిపాదనలు
రెండు మెస్‌లలో కిచెన్, డైనింగ్ ఆధునికీకరణ
వర్సిటీలోని ఆస్పత్రి ప్రక్షాళన...ఐదుగురు మెడికల్ ఆఫీసర్ల నియామకం
వర్సిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంకితభావంతో పని చేస్తున్నా
‘ఆంధ్రజ్యోతి’తో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్
విశాఖపట్నం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి):
‘‘ఆంధ్ర విశ్వవిద్యాలయం ఖ్యాతి ఇనుమడించేలా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. గడిచిన ఏడాదికాలంగా విభిన్నమైన కార్యక్రమాలతో ఎంతోమంది ప్రముఖులను వేడుకల్లో భాగస్వామ్యులను చేశాం. ఈ నెల 26న నిర్వహించే శతాబ్ది వేడుకల కీలక ఘట్టానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను ఆహ్వానిస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలూమ్నీకి చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు’’...అని ఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ చెప్పారు. ఉపకులపతిగా ఏడాది కాలంలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రాజెక్టులు, ఏయూ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ప్రణాళిక, అమలు తదితర అంశాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి ఆయన వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
ఏడాది నుంచి వేడుకలు..
గత ఏడాది మార్చి ఒకటిన వీసీగా బాధ్యతలు చేపట్టాను. ఏప్రిల్ 26న శతాబ్ది ఉత్సవాల ముందస్తు కార్యక్రమాలు ప్రారంభించాం. ఈ క్రమంలోనే మౌలిక వసతుల కల్పన, అకడమిక్ చాలెంజెస్ వంటి అంశాలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. అకడమిక్ ఎక్స్‌లెన్స్‌లో నేషనల్, ఇంటర్నేషనల్ ప్రముఖులను ఆహ్వానించి సైన్స్ అండ్ టెక్నాలజీ కాంక్లేవ్‌లు నిర్వహించాం. ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ, పది జాతీయ కాన్ఫరెన్స్‌లు నిర్వహించాం. ఉత్సవాల్లో భాగంగా స్పోర్ట్స్ ఈవెంట్, శతాబ్ది వాణి (ఎమినెంట్ పీపుల్స్‌తో), బీటెక్ క్వాంటం కంప్యూటింగ్‌పై ఎఫ్‌డీపీ, ఎండోమెంట్ లెక్చర్స్, మెగా ఎన్‌ఎస్‌ఎస్ డే, కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అకడమిక్ ఈవెంట్స్, నేషనల్ సైన్స్ డే వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహించాం. వర్సిటీలోని విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకునేందుకు సంధ్య అవర్, అవర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫార్మా అన్వేషణ్, వుమెన్ ఆయుర్వేద పరిషత్ కాంక్లేవ్, మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించాం. అంతర్జాతీయ విద్యార్థులను వేడుకల్లో భాగస్వాములను చేస్తూ ఫుడ్ ఫెస్ట్, కల్చరల్ ఈవెంట్, ఏయూ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో శతాబ్ది కళా ఉత్సవ్‌ను నిర్వహించాం. పాడేరులో 300 మంది గిరిజన విద్యార్థులు, పార్వతీపురంలో 500 మంది విద్యార్థులతో ఎడ్యుకేషన్ సదస్సులు నిర్వహించాం. మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ సదస్సులు నిర్వహించనున్నాం.
ప్రముఖులు, సంస్థలతో కీలక ఒప్పందాలు..
వందేళ్ల వేడుకల నేపథ్యంలో వర్సిటీలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. ఇందుకోసం పూర్వ విద్యార్థుల సంఘం, ప్రముఖ పూర్వ విద్యార్థులను అనుసంధానం చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈ క్రమంలోనే యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ర్టేలియాతో వంద మంది ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించాం. వారంతా వర్సిటీలోని విద్యార్థులకు కెరియర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ మీద శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే మినిస్ర్టీ ఆఫ్ హెవీ ఇండస్ర్టీస్ ఆధ్వర్యంలో ఇండస్ర్టీ 4.0 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాం. ఇందుకు రూ.5 కోట్లు మంజూరయ్యాయి. అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోఫికల్ మెట్రియాలజీ వాళ్లు కోస్టల్ అట్మాస్పిరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ మంజూరైంది. ఇందుకు రూ.180 కోట్లు మంజూరుచేశారు. ఇప్పటికే రూ.60 కోట్లు విలువజేసే పరికరాలను కేజీహెచ్‌కు పంపించారు. మరో రూ.120 కోట్ల పరికరాలు రానున్నాయి. తీర ప్రాంతాల్లో వాతావరణ మార్పులు, రుతుపవనాలపై పరిశోధన చేసేందుకు ఇది దోహదం చేస్తుంది. పెండింగ్‌లో ఉన్న రూసా నిధులతో డ్రగ్ అండ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌కు అవసరమైన పరికరాలను రూ.18 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించాం. బీటెక్ క్వాంటం కంప్యూటింగ్ కోర్సును ప్రారంభించి నిర్వహిస్తున్నాం. తొలి విడతలో పది కోట్లతో క్వాంటం కంప్యూటింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నాం.
మౌలిక వసతులకు ప్రాధాన్యం..
విద్యార్థుల మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆరు హాస్టల్స్, రెండు మెస్‌లలో కిచెన్, డైనింగ్‌ను ఆధునికీకరించాం. రెండు కోట్ల రూపాయలతో వర్సిటీలోని కీలక విభాగాలు, భవనాల్లో మైనర్ రిపేర్లు, రూఫ్ లీకేజీ అరికట్టే పనులు చేపట్టం. వర్సిటీలోని ఆస్పత్రిని ప్రక్షాళన చేశాం. ఐదుగురు మెడికల్ ఆఫీసర్లను నియమించడంతోపాటు ఇద్దరు కన్సల్టెంట్ డాక్టర్లను అందుబాటులోకి తెచ్చాం. ఫార్మసిస్టులు, అంబులెన్స్ బాయ్స్, క్లినికల్ పరీక్షలు నిర్వహణకు అవసరమైన కొత్త పరికరాలను అందుబాటులోకి తెచ్చాం. అదనంగా మరో అంబులెన్స్ కొనుగోలు చేయనున్నాం.
నిధుల సమీకరణపై ఫోకస్..
వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో భారీగా నిధులను సమీకరించడంపై దృష్టి సారించాం. ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. అభివృద్ధి పనులు చేపట్టేందుకు హెరిటేజ్ యూనివర్సిటీ కింద కేంద్రానికి రూ.200 కోట్లతో, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.500 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. పూర్వ విద్యార్థులు నుంచి కూడా నిధులు స్వీకరిస్తున్నాం. వేయి నుంచి ఎంతైనా ఇవ్వవచ్చు. పూర్వ విద్యార్థులు కూడా భారీఎత్తున నిధులు అందిస్తారని భావిస్తున్నాం. ఈ మేరకు 26న నిర్వహించే ప్రధాన కార్యక్రమం రోజున ప్రభుత్వం, పూర్వ విద్యార్థులు నుంచి ప్రకటనలు ఉంటాయని ఆశిస్తున్నాం. ఇప్పటికే పూర్వ విద్యార్థులు అయిన దేవ పురాణం రూ.70 లక్షలు, మరో పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ వీఎస్ రాజు పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్, ఇతర అవసరాల కోసం రూ.2 కోట్లు అందించేందుకు ముందుకువచ్చారు. మరింతమంది పూర్వ విద్యార్థులు అందించే సాయంపై చర్చలు జరుగుతున్నాయి.
సన్మానాలు, సత్కారాలు..
శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఆయా రోజుల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పూర్వ విద్యార్థులైన ప్రముఖులను ఆహ్వానించి సన్మానించనున్నాం. సీనియర్, రిటైర్డ్ ఫ్యాకల్టీ, స్టాఫ్, విద్యార్థులకు సత్కారాలు, ప్రతిభ అవార్డుల ప్రదానం ఉంటాయి. ఈ నెల 26న నిర్వహించే సెంటినరీ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్‌లో వర్సిటీలో చదివి దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన 40 మందిని ఘనంగా సత్కరించనున్నాం. 18 నుంచి 26 వరకు జరిగే కార్యక్రమాల్లో ఎవరైనా పాల్గొనేలా ప్యానల్ డిస్కషన్, లైవ్ స్ర్టీమింగ్ ఉంటుంది. వర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్లు ఇప్పటివరకు 50 మంది వివిధ వర్సిటీల వీసీలుగా, ఇతర కీలక స్థానాల్లో పనిచేశారు. వారితో ప్యానల్ డిస్కషన్ ఏర్పాటుచేశాం.
పదేళ్లలో అభివృద్ధి ప్రణాళిక..
వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశాం. ఈ నెల 26న ప్రధాన వేడుకల్లో విడుదల చేస్తాం. ఇందులో వర్సిటీని రానున్న పదేళ్లలో ఎలా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు ఉన్నాయి. ఈ అభివృద్ధి ప్రణాళికలో ప్రభుత్వంతోపాటు పూర్వ విద్యార్థుల సంఘాలు సహకారాన్ని అందించాలి. ఉత్సవాల్లో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావడానికి అనుగుణంగా అలూమ్ని పోర్టల్ విడుదల చేశాం. వర్చువల్‌గా పాల్గొనే అవకాశాన్ని కల్పించాం. పాల్గొనే అవకాశం లేని వాళ్లను 30 సెకండ్ల నిడివితో వీడియో పంపించాలని కోరాం. వాటిని ఆయా రోజుల్లో నిర్వహించే వేడుకల్లో డిస్‌ప్లే చేయడంతోపాటు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం. వర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ అలూమ్నీ అసోసియేషన్ (ఏఏఏ), ఏయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అలూమ్నీ అసోసియేషన్ ఉన్నాయి. ఈ రెండింటి సహకారాన్ని తీసుకుంటూ ముందుకు వెళుతున్నాం.
క్యూఎస్ ర్యాంకింగ్స్ టాప్-100లో నిలబెట్టాలన్నదే లక్ష్యం
వర్సిటీని దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలబెట్టాలన్నది నా కోరిక. స్టేట్ ఫండింగ్ యూనివర్సిటీల జాబితాలో ఏయూ నాలుగో స్థానంలో ఉంది. ఒకటో స్థానానికి తీసుకురావడమే లక్ష్యం. ఓవరాల్ కేటగిరీలో 41వ స్థానంలో ఉన్నాం. దీనిని మరింత మెరుగుపర్చుకోవాలి. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో టాప్-100లో నిలబెట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. గ్యాప్ అనాలసిస్ చేసుకుంటూ ఐదేళ్లలో టాప్‌లోకి చేరుకుంటాం. ఇందుకోసం పరిశోధన ప్రమాణాలు పెంచాలి. నూతన భవనాలు నిర్మించాలి. ల్యాబ్‌లు ఏర్పాటుచేయాలి. వాటిపైన దృష్టిసారిస్తున్నాం. ఫ్యాకల్టీ కొరతతో ఇబ్బందులు ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మాస్టర్ ప్లాన్‌ను మూడు దశల్లో అమలుచేస్తాం. గొప్ప చరిత్ర కలిగిన వర్సిటీకి వీసీగా చేయడం ఆనందంగా ఉంది. అంతే బాధ్యతతో పనిచేస్తున్నా. దేశంలో వందేళ్ల వేడుకలు జరుపుకున్న ఐదు విశ్వవిద్యాలయాలతో పోల్చి చూస్తే...వాటికంటే ఎక్కువగానే వర్సిటీలో కార్యక్రమాలు నిర్వహించాం. క్యాంపస్ బ్యూటిఫికేషన్, ల్యాండ్ స్కేప్ చేయాలన్నది కోరిక. వేడుకల తరువాత ఆ పనులు పూర్తిచేస్తాం. కొత్త భవనాలు నిర్మాణాలు, ఆధునికీకరణ వంటి పనులు చేస్తాను.