Share News

అంబరాన్నంటిన శతాబ్ది సంబరం

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:23 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది సంబరం అంబరాన్నంటింది.

అంబరాన్నంటిన శతాబ్ది సంబరం

  • ఘనంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల వేడుకలు

  • ప్రత్యేక స్టాంపు, నాణెం, కాఫీ టేబుల్‌ బుక్‌ను విడుదల చేసిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌

  • ఏయూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్థానానికి చేరుకోవాలని ఆకాంక్ష

  • రాబోయే వందేళ్లలో మరింత అభివృద్ధి సాధిస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది సంబరం అంబరాన్నంటింది. ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ముగింపు సభకు ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, గౌరవ అతిథిగా ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్‌తోపాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. తొలుత మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహంచారు. నాలుగు గంటలకు వేదికపైకి సీఎం చంద్రబాబునాయుడు, సచిన్‌ టెండూల్కర్‌, ఇతర ప్రముఖులు, ఆ తరువాత ముఖ్య అతిథి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ చేరుకున్నారు. తొలుత సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్‌ నజీర్‌ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. అనంతరం ముఖ్య అతిథి చేతుల మీదుగా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక స్టాంపు, నాణెం, కాఫీ టేబుల్‌ బుక్‌ను విడుదల చేశారు. ఆ తరువాత వర్సిటీలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి, ఇతర అతిథుల సమక్షంలో అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా, ఆక్సిమిక్‌ ల్యాబ్స్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోఫికల్‌ మెటీరియాలజీ (ఐఐటీఎం) సంస్థలతో ఏయూ అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. అనంతరం సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ ఏయూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ నగరం ఒక శక్తివంతమైన ఎకనామిక్‌ హబ్‌గా అవతరిస్తోందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన భారతరత్న సచిన్‌ టెండుల్కర్‌ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యతోనే విజయం సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఏయూ నూరు వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా చెబుతున్నానని, రాబోయే వందేళ్లు మరో బ్రాండ్‌ సృష్టిస్తుందని అన్నారు. మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ ఇక్కడ విద్యార్థులను చూస్తుంటే తనకు అసూయ కలుగుతోందని, తాను కూడా ఏయూలో చదివి ఉంటే ఎంతో బాగుండేదనిపిస్తోందన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తాను సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఏయూ ఎంతగానో దోహదం చేసిందన్నారు.

ఆకట్టుకున్న ఏయూ హెరిటేజ్‌-లెగసీ ఫొటో ఎగ్జిబిషన్‌

శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయ చరిత్ర, చారిత్రక సంఘటనలను తెలిపేవిధంగా ఏర్పాటుచేసిన ఏయూ హెరిటేజ్‌-లెగసీ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, సీఎం చంద్రబాబునాయుడు, ఇతర ప్రముఖులతో కలిసి తిలకించారు. ఎగ్జిబిషన్‌ ప్రత్యేకతను వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ వివరించారు. ప్రధాన వేదికకు వెనుక భాగంలో ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్‌ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. 1926 నుంచి నేటి వరకు విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రధాన ఘట్టాలను తెలియజేసేలా ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేశారు. ఏయూ చిత్రకళా విభాగం విద్యార్థులు తయారుచేసిన అనేక శిల్పాలను ప్రదర్శనలో ఉంచారు. మంగళవారం, బుధవారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రదర్శనను తిలకించేందుకు నగరవాసులను అనుమతించనున్నట్టు ఏయూ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - Apr 28 , 2026 | 01:23 AM