రెండు దశల్లో జనగణన
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:48 AM
జిల్లాలో జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం గణన చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలోని శంకరన్ భవన్‌లో బుధవారం ప్రారంభమైన జనగణన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తొలుత బ్లాకుల వారీగా గృహాల లెక్కింపు
రెండో విడత జనాభా లెక్కలు
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం గణన చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలోని శంకరన్ భవన్‌లో బుధవారం ప్రారంభమైన జనగణన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి దశలో బ్లాకుల వారీగా గృహాల లెక్కింపు జరుగుతుందని, రెండో దశలో జనాభా గణన వచ్చే ఏడాది నిర్వహించాలని చెప్పారు. గతంలో జనాభా గణన మాన్యువల్‌గా జరిగేదని, ఈసారి ఎలకా్ట్రనిక్ విధానంలో జరుగుతుందని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ జనగణన చేపట్టాలని సూచకించారు. జనగణన కోసం ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. అన్నిస్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు సజావుగా సాగాలని సూచించారు. డీఆర్‌ఓ, జిల్లా జనాభా గణన అధికారి సత్యనారాయణరావు మాట్లాడుతూ, దేశంలో ప్రతి పదేళ్లకోసారి జనభా లెక్కల సేకరణ జరుగుతుందని, అయితే 2021లో కొవిడ్ కారణంగా ఈ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టలేదని చెప్పారు. ఆ ఏడాది జరగాల్సిన జనభా లెక్కల సేకరణ ఇప్పుడు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన వారంతా క్షేత్రస్థాయిలో సిబ్బందికి జనాభా గణనపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సమన్వయ సూపరింటెండెంట్ వీఎస్ వాసునాయుడు, మాస్టర్ ట్రైనర్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.