Share News

నేడు సంబరాలు

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:45 AM

దేశంలో 18వ రైల్వేజోన్‌గా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పాలన సోమవారం నుంచి విశాఖలో ప్రారంభం కానుంది.

నేడు సంబరాలు

రైల్వే జోన్‌ ప్రారంభం సందర్భంగా పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ

ఉత్తరాంధ్ర ఆత్మగౌరవానికి ప్రతీక: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

18వ జోన్‌గా అవతరణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి):

దేశంలో 18వ రైల్వేజోన్‌గా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పాలన సోమవారం నుంచి విశాఖలో ప్రారంభం కానుంది. కొత్త రైల్వేజోన్‌ అమల్లోకి రావడం ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో జోష్‌ నింపింది. జోన్‌ ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, కేంద్ర మంత్రులు, ఏంపీలు, బీజేపీ నాయకుల కృషి, చొరవ, ప్రయత్నం ఫలించింది.

రాష్ట్ర చరిత్రలో కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటు గొప్ప విజయంగా భావించిన తెలుగుదేశం పార్టీ సోమవారం సంబరాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించి ఈ విజయాన్ని ప్రజలకు చేరువ చేయాలని సూచించింది. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు ఉత్తరాంధ్రవాసుల ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు. జూన్‌ ఒకటోతేదీ చిరస్థాయిగా నిలిచిపోయే రోజని, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలని, తరాల పోరాటం, లక్షలాదిమంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా జోన్‌ ఆవర్భివించిందన్నారు. రైల్వేజోన్‌ కోసం చేసిన పోరాటాలు, ఉద్యమాలు తలచుకుంటే గర్వంగా ఉందన్నారు. ఇందుకోసం మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పోరాటం సాగించిందని, పార్టీ నాయకులు పార్లమెంటు, ప్రజాక్షేత్రంలో నిరంతరం గట్టిగానే పోరాడారన్నారు. ప్రజల సమస్యలపై నిజాయితీగా, నిరంతరం పోరాడితే ఫలితం వస్తుందనే నమ్మకానికి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ సజీవ నిదర్శనమాన్నరు. తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే రోజని, తెలుగు ప్రజలంతా దీనిని పండుగలా జరుపుకోవాలని పల్లా పిలుపునిచ్చారు.

బీజేపీ హర్షం

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభిస్తుండడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్‌వీ మాధవ్‌ హర్షం వ్యక్తంచేశారు. జోన్‌ పరిధిలో మొత్తం 3532 రూట్‌ కిలోమీటర్ల మేరకు రైల్వేనెట్‌వర్క్‌ ఉండగా డబుల్‌, ట్రిపుల్‌ లైన్లతో కలిసి ట్రాక్‌ పొడవు 6,454 కిలోమీటర్లకు చేరుకుందన్నారు. జోన్‌లో నాలుగు డివిజన్లు, 385 రైల్వేస్టేషన్లు ఉన్నాయన్నారు. జోన్‌లో 62 వేలమంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా జోన్‌ ప్రధాన కార్యాలయంలో 128 గజిటెడ్‌, 1,100 మంది ఉద్యోగులు పనిచేస్తారన్నారు. నగరం శివారు వడ్లపూడి రైల్వేవ్యాగన్‌ డిపోలో రోజుకు సగటున 250 నుంచి వ్యాగన్ల నిర్వహణ, తనిఖీ, మరమ్మతులు చేపట్టే సామర్ధ్యం కలిగిన సంస్థ ఈ జోన్‌లో ఉందన్నారు. జోన్‌తో రైల్వే మౌలిక వసతులు బలోపేతం అవుతాయని, పారిశ్రామిక అభివృద్ధి, వ్యాపారావకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నరు.


దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్‌ఓగా బాలాజీ కిరణ్‌

విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (సీపీఆర్‌ఓ)గా వి.బాలాజీ కిరణ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ (ఐఆర్‌టీఎస్‌)లో 2013 బ్యాచ్‌కు చెందిన అధికారి. సీపీఆర్‌ఓ బాధ్యతలతో పాటు జీఎం సందీప్‌ మాధుర్‌ సెక్రటరీగా, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. గత ఏడాది నవంబరు నుంచే సెక్రటరీగా సేవలందిస్తున్నారు. భారతీయ రైల్వేలో విశేష అనుభవం ఉన్న బాలాజీ కిరణ్‌ గుంతకల్‌ డివిజన్‌లో సీనియర్‌ డివిజన్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా, సికింద్రాబాద్‌, హైదారాబాద్‌ డివిజన్లలో సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా పనిచేశారు. శ్రీకాళహస్తిలో బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదివారు. అక్కడే పబ్లిక్స్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశారు.

Updated Date - Jun 01 , 2026 | 12:45 AM