రెండు వారాలైనా ముగియని ఉత్సవాలు
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:53 AM
రెండు తెలుగు రాష్ట్రాల్లోను వినాయక చవితి ఉత్సవాలు ముగిసిపోయాయి.
గాజువాకలో అన్నదాన విరాళం పేరిట రూ.50 వసూలు
బీచ్‌రోడ్డులో రుద్రాక్ష రూ.50 చొప్పున విక్రయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రెండు తెలుగు రాష్ట్రాల్లోను వినాయక చవితి ఉత్సవాలు ముగిసిపోయాయి. విశాఖపట్నంలో మాత్రం ఇంకా రెండు చోట్ల నడుస్తూనే ఉన్నాయి. ఇవి పూర్తిగా వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఈ నెల 14న వినాయక చవితి కాగా చాలా మంది నవరాత్రులు చేసి విగ్రహాలను నిమజ్జనం చేసేశారు. కానీ, గాజువాక శ్రీనగర్ (గాజులతో విగ్రహం), ఆర్కే బీచ్ రోడ్డులోని గోకుల్ పార్కు వద్ద (రుద్రాక్షలతో విగ్రహం) మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. గాజువాక శ్రీనగర్‌లో మొదట ఉచిత దర్శనాలు అని ప్రకటించిన నిర్వాహకులు ఇప్పుడు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. దానికి ‘స్వచ్ఛంద అన్నదాన విరాళం’ అని రశీదు ఇస్తున్నారు. ఇక బీచ్‌రోడ్డులో ఏకంగా ఫోన్‌పే క్యూఆర్ కోడ్ స్టిక్కరే అతికించేశారు. రూ.50 చొప్పున చెల్లిస్తే ప్రసాదం కింద రుద్రాక్ష ఇస్తున్నారు. అదికాకుండా ఆ ప్రాంగణంలో టెంట్లు వేసి విశాఖ ఉత్సవ్ తరహాలో ఫుడ్ స్టాళ్లు నిర్వహిస్తున్నారు. వీటికి జీవీఎంసీ ఎలా అనుమతి ఇచ్చిందో అర్థం కావడం లేదు. అనుమతి లేకపోతే పోలీసులు ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియదు. ఇప్పటికైనా ఈ ఉత్సవాలకు ముగింపు పలికి, ఈ భక్తివ్యాపారానికి స్వస్తి చెప్పాల్సి ఉంది.
వర్షాలతో జీవీఎంసీకి రూ.6 కోట్లు నష్టం
11.5 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారులు
విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు కురిసిన భారీవర్షాల కారణంగా జీవీఎంసీకి సుమారు రూ.ఆరు కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. వర్షం నీరు పలుచోట్ల రోడ్లపై నిలిచిపోయింది. దీనివల్ల దాదాపు 11.5 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేయగా, శాశ్వత మరమ్మతులకు రూ.ఐదు కోట్లు వరకు అవసరమవుతాయని అంచనా వేశారు. పన్నెండుచోట్ల ప్రహరీ గోడలు కూలిపోగా, పదకొండుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. పదిహేను కుటుంబాలకు చెందిన 70 మందిని ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు, 56 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
పునరావాస ఖర్చులకు రూ.కోటి విడుదల
విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సహాయక చర్యలు, పునరావాసం కోసం జిల్లాకు ప్రభుత్వం కోటి రూపాయలు విడుదల చేసింది. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నగరంలో పలుచోట్ల పునరావాస శిబిరాలు నిర్వహించారు. గాలులకు నేలకొరిగిన చెట్లు తొలగించడానికి యంత్రాలు, సిబ్బందిని వినియోగించారు. ఈ ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసింది.
నేడు స్కూల్ కమిటీ ఎన్నికలు
జిల్లాలో 593 పాఠశాలల్లో నిర్వహణ
విశాఖపట్నం,సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. మొత్తం 593 పాఠశాలల్లో మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక నిర్వహణకు కనీసం 50 శాతం మంది తల్లిదండ్రులు, సంరక్షకులు హాజరుకావాలి. వంద మందిలోపు విద్యార్థులు గల పాఠశాలలో 12 మంది, 100 మంది నుంచి 500 మంది విద్యార్థులు ఉంటే 20 నుంచి 25 మంది కమిటీ సభ్యులుగా ఉంటారు. 15 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల్లో తల్లిదండ్రులు అందరికీ సభ్యత్వం ఉంటుంది. కమిటీ సభ్యుల్లో మహిళలు 50 శాతం ఉండాలి. ఇంకా అన్ని కేటగిరీలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఎన్నికలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికైన సభ్యుల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎంపిక చేస్తారు. అనంతరం ప్రమాణ స్వీకారం ఉంటుంది. సాయంత్రం నాలుగు గంటలకు నూతన కమిటీ తొలి సమావేశం ఏర్పాటుచేస్తారు. కాగా జిల్లాలో ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ జె.చంద్రశేఖరరావు తెలిపారు.
గుట్టుగా పాన్‌మసాలా తయారీ
నిందితుడి అరెస్టు...రూ.54.6 కోట్ల సెస్ ఎగవేత
విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పెదగంట్యాడలో రహస్యంగా పాన్‌మసాలా తయారుచేస్తున్న ఒకరిని విశాఖపట్నం సెంట్రల్ జీఎస్‌టీ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారంతో సెంట్రల్ జీఎస్‌టీ అధికారులు పెదగంట్యాడలో ఒక ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు. అక్కడ అనధికారికంగా పాన్‌మసాలాను తయారుచేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఆరోగ్య భద్రతే జాతి భద్రత (హెచ్‌ఎస్‌ఎన్‌ఎస్) సెస్ చట్టం 2025 ప్రకారం ఆ వ్యాపారిపై కేసు నమోదుచేశారు. లావాదేవీలను గుర్తించి ప్యాకింగ్ మిషన్లు, లభించిన ప్యాకెట్ల బరువు ఆధారంగా రూ.54.6 కోట్ల సెస్ ఎగవేసినట్టు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి, ఆర్థిక నేరాలు, నాలుగో మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు విశాఖ సెంట్రల్ జీఎస్‌టీ అసిస్టెంట్ కమిషనర్ సోమవారం తెలిపారు.