Share News

నాలుగుచోట్ల వేడుకలు

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:55 AM

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ఈ నెల 30, 31 తేదీల్లో ‘అనకాపల్లి ఉత్సవ్‌’ను నాలుగుచోట్ల.. అనకాపల్లి ఎన్టీఆర్‌ స్టేడియం, బెల్లం మార్కెట్‌ యార్డు, అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ, పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను తొలుత శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కొండకర్ల ఆవ వద్ద ప్రారంభిస్తారు.

నాలుగుచోట్ల వేడుకలు
కొండకర్ల ఆవ వద్ద ఉత్సవ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌, ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌

ఉదయం 9 గంటలకు కొండకర్ల ఆవలో ‘అనకాపల్లి ఉత్సవ్‌’ ప్రారంభం

హాజరుకానున్న స్పీకర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

11.30 గంటలకు ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో ఫ్లవర్‌ షో ప్రారంభం

మధ్యాహ్నం తరువాత ముత్యాలమ్మపాలెంలో బీచ్‌ ఫెస్టివల్‌

సాయంత్రం ఎన్టీఆర్‌ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి

అనకాపల్లి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ఈ నెల 30, 31 తేదీల్లో ‘అనకాపల్లి ఉత్సవ్‌’ను నాలుగుచోట్ల.. అనకాపల్లి ఎన్టీఆర్‌ స్టేడియం, బెల్లం మార్కెట్‌ యార్డు, అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ, పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను తొలుత శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కొండకర్ల ఆవ వద్ద ప్రారంభిస్తారు. అధికార వర్గాల సమాచారం మేరకు ఈ కార్యక్రమానికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, హోం మంత్రి అనిత, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రముఖులు ప్రసంగిస్తారు. ఫుడ్‌ స్టాల్స్‌, ఫ్లోటింగ్‌ షాపింగ్‌ మార్కెట్‌ను, బోట్‌ రైడింగ్‌ను ప్రారంభిస్తారు. 11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డుకు చేరుకొని పుష్పప్రదర్శనను ప్రారంభిస్తారు. ఫ్లవర్‌ షోతోపాటు వివిధ రకాల స్టాల్స్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం తరువాత 2.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ముత్యాలమ్మపాలెం సాగరతీరానికి చేరుకొని బీచ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తారు. వివిధ రకాల స్టాల్స్‌ను సందర్శిస్తారు. పారా మోటరింగ్‌ రైడ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, కబడ్డీ, వాలీబాల్‌ వంటి బీచ్‌ స్పోర్ట్స్‌ను ప్రారంభిస్తారు. రాత్రికి గాయని గీతామాధురి సంగీత విభావరి, బుల్లితెర హాస్య కళాకారుల (జబర్దస్త్‌) స్కిట్లు వుంటాయి. స్థానిక కళాకారుల తప్పెటగుళ్లు, కోలాటం, థింసా నృత్యం, సంప్రదాయ నృత్య రూపకాలు ప్రదర్శిస్తారు.

సాయంత్రం 5.30 గంటలకు ముత్యాలమ్మపాలెంలో కార్యక్రమాలను ముగించుకొని 6.30 గంటలకు అనకాపల్లి మార్కెట్‌ యార్డుకుు చేరుకొంటారు. ఇక్కడి నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు వివిధ కళాప్రదర్శనలతో ఊరేగింపు (కార్నివాల్‌) నిర్వహిస్తారు. అనంతరం సాంస్కృతి కార్యక్రమాలు, గీతా మాధురి సంగీత విభావరి వుంటాయి. ఇక్కడ వివిధ రకాల ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడే శనివారం రాత్రి సినీ గాయకుడు రామ్‌ మిరియాల ఆధ్వర్యంలో సంగీత విభావరి, క్రాకర్స్‌ షో, స్థానిక కళాకారుల ప్రదర్శనలు వుంటాయి.

Updated Date - Jan 30 , 2026 | 12:55 AM