సంబరం.. ఆరంభం
ABN , Publish Date - May 17 , 2026 | 10:17 PM
మోదకొండమ్మ మూడు రోజుల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉన్న మోదకొండమ్మ ఉత్సవ విగ్రహం, అమ్మవారి పాదాలను శతకంపట్టులో కొలువుతీర్చే తంతుతో మూడు రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఉత్సవ విగ్రహం, ఉత్సవాల అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి తల్లిగరగను తలకెత్తుకుని ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఘనంగా మొదలైన మోదకొండమ్మ ఉత్సవాలు
శతకంపట్టులో కొలువుదీరిన అమ్మవారు
మూడు రోజులు అక్కడే ప్రత్యేక పూజలు
ఉత్సాహంగా ఉత్సవ విగ్రహం ఊరేగింపు
రెట్టింపుగా హాజరైన భక్తులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మోదకొండమ్మ మూడు రోజుల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉన్న మోదకొండమ్మ ఉత్సవ విగ్రహం, అమ్మవారి పాదాలను శతకంపట్టులో కొలువుతీర్చే తంతుతో మూడు రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఉత్సవ విగ్రహం, ఉత్సవాల అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి తల్లిగరగను తలకెత్తుకుని ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఆలయ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, తదితరులు అమ్మవారి విగ్రహాన్ని, పాదాలు, తల్లి గరగలను తలకెత్తుకున్నారు. ఆలయం నుంచి భారీ ఊరేగింపుతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలు, తల్లి గరగలను శతకంపట్టు వరకు తీసుకువచ్చి అక్కడ కొలువుతీర్చారు. ఊరేగింపులో అమ్మవారి విగ్రహాన్ని, పాదాలను తాకేందుకు భక్తులు ఎగబడ్డారు. ఊరేగింపు అగ్ర భాగాన అమ్మవారికి ప్రీతిపాత్రమైన డప్పుల వాయిద్యాలు, గరగర, వివిధ వేషధారణ నృత్యాలు, కేరళ ఓనం బ్యాండ్‌ను ఏర్పాటు చేశారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్, ఏఎస్‌పీ నవజ్యోతిమిశ్రా పర్యవేక్షణలో జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్‌ఐలు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. తొలి రోజు ఊరేగింపులో రెట్టింపుగా భక్తులు పాల్గొన్నారు.
మూడు రోజులు శతకంపట్టులో ప్రత్యేక పూజలు
ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఆదివారం శతకంపట్టులో కొలువు తీరిన మోదకొండమ్మకు అధిక సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. మూడు రోజుల పాటు ప్రత్యేకంగా ఇక్కడే పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాలు ఆఖరి రోజు మంగళవారం శతకంపట్టులో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని, పాదాలను పట్టణ వీధుల్లో భారీగా ఊరేగించి, తిరిగి ఆలయంలో చేర్చుతారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు శతకంపట్టులో, ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు దన్నేటిపలాసి సురేశ్‌కుమార్, బూరెడ్డి నాగేశ్వరరావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటినాయుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలుపర్తి గోవిందరావు, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.